డీజే – దువ్వాడ జగన్నాథమ్ కథ ఇదీ.. అంటూ కొన్ని కథలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. జెంటిల్మెన్లా ఉంటుందని కొందరు, కాదు.. అదుర్స్నే అటూ ఇటూ మార్చి తీశారని కొందరు ఈ సినిమా ‘కథ’లు అల్లేశారు. అదెంత వరకూ నిజమో తెలీదు గానీ… ఇప్పుడు డీజే స్టోరీ లైన్ బయటకువచ్చేసింది. అదీ.. దర్శకుడు హరీష్ శంకర్ నోటి నుంచే. డీజే లో ఈమధ్య విడుదల చేసిన గుడి, బడి, మడి అనే పాటపై బ్రాహ్మణ సంఘాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఆ పాట కోసం క్లారిటీ ఇస్తూ. హరీష్ శంకర్ చూచాయిగా డీజే కథ లీక్ చేశాడు. ‘శాపాదపీ.. శరాదపీ’ అనే అంశం ఆధారంగా డీజే కథ తయారైందట. అంటే.. ఓ దద్భాహ్మడు శాపం వల్లగానీ, శరం (అంటే బాణం) వల్ల గానీ విజయం సాధిస్తాడు అని చెప్పడం.
ఓ బ్రాహ్మణుడికి కోపం వస్తే శపిస్తాడు.. లేదంటే బాణం సంధిస్తాడు.. రెండింటా తనకి విజయమే. అలా ఓ కథానాయకుడు సంఘంలోని ద్రోహులపై శపించి, బాణాలు సంధించి విజయం ఎలా సాధించాడో ఈ సినిమాలో చూపిస్తున్నారన్నమాట. డీజే.. శాపం అంత పవర్ఫుల్ అన్నమాట. ఈనెల 23న ఈసినిమా విడుదల కానుంది. ఒక్కో పాట విడుదల చేస్తూ.. ప్రమోషన్ల కార్యక్రమం మొదలెట్టింది చిత్రబృందం. దానికి తోడు తాజా వివాదం ఒకటి. అదీ… డీజే ప్రమోషన్లకు ఇతోదికంగా సహాయపడేదే. మొత్తానికి ఈ వివాదం వల్ల డీజే స్టోరీ లైన్ బయటకు వచ్చేసినట్టైంది. ఈ పాయింట్ చాలదూ.. గాసిప్ రాయుళ్లు ఇంకొన్ని కొత్త కథలు అల్లుకోవడానికీ..!