కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కుటుంబ పాలన అనే అంశంపై తాజాగా స్పందించారు! అయితే, ఆయన స్పందించిన తీరును ఎలా అర్థం చేసుకోవచ్చు అనేదే ప్రశ్న! తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా ఆయనకు మాట్లాడుతున్నారా… లేదంటే, తెరాసను అలా విమర్శించే హక్కు కేవలం భాజపాకి మాత్రమే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా..?
ఇంతకీ పాయింట్ ఏంటంటే.. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ సభలో ఆయన తెరాస సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందనీ, ఆ నలుగురి అభివృద్ధి కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నట్టుగా ఉందంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కూడా వెంటనే స్పందించారు. కుటుంబ పాలన గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం హాస్యాస్పదం అంటూ ఆయన ఎద్దేవా చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా, రాహుల్ ఫొటోలతో ఒక ట్వీట్ పెట్టారు. సో.. ఇక్కడితో ఈ టాపిక్ మీద చర్చ ముగిసిపోయినట్టే కదా. రాహుల్ ఒక మాటన్నారు, కేటీఆర్ రిప్లై ఇచ్చారు. అయితే, ఇదే అంశంపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించడం విశేషం!
దేశంలో వారసత్వ రాజకీయాలకు మూలమే కాంగ్రెస్ పార్టీ అనీ, పెంచి పోషిస్తున్నది వారే అని వెంకయ్య వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోని వారసత్వ ధోరణులను పెట్టుకుని, తెరాస సర్కారును రాహుల్ ప్రశ్నించడం ఏంటని విమర్శించారు. కుటుంబ రాజకీయాలపై రాహుల్ మాటలు వింటుంటే గురివింద గింజ చందంగా ఉన్నారు. దేశంలో ఎక్కడా లేనంతగా వారసత్వ రాజకీయాలు సాగించిన చరిత్ర ఆ పార్టీకే ఉందనీ, గతం గుర్తులేనట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే చూడ్డానికి నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు.
అయితే, ఇక్కడ తెరాసను వెనకేసుకు వచ్చే విధంగా వెంకయ్య మాట్లాడినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో మరో విశ్లేషణకు కూడా ఆస్కారం ఉంది! ఎలా అంటే.. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని టి. భాజపా నేతలు కూడా కేసీఆర్ సర్కారుపై విమర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే, తెరాసపై ఈ తరహా విమర్శలు చేసే హక్కు కేవలం భాజపాకి మాత్రమే ఉందని వెంకయ్య చెబుతున్నట్టు కూడా అనుకోవచ్చు. తెరాస కుటుంబ పాలనపై విమర్శించే హక్కు కాంగ్రెస్ కు లేదని, తమకు మాత్రమే ఉందన్న అంతరార్థం ఆయన మాటల్లో ధ్వనిస్తోంది.