రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రను పూర్తిగా ముంచేసింది కాంగ్రెస్ పార్టీ. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావడం కష్టమని తెలిసి పూర్తిగా తెలంగాణా ప్రజలను మెప్పించడానికే ప్రయత్నించింది. విభజన ఎలా చేయాలో కెసీఆర్ చెప్పి ఉన్నా కూడా ఇంత అన్యాయంగా విభజన జరిగి ఉండేది కాదు. భద్రాచలం లాంటివి ఆంధ్రాలో కలిసి ఉండేవి. అయితే అదంతా కూడా ఇప్పుడు చరిత్ర. నాయకులు, ప్రజలు కూడా ప్రస్తుతం ఏంటి అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అప్పుడు అన్యాయం చేసినప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తానని చెప్తున్నాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ సభకు తన సంఘీబావం తెలిపాడు పవన్. కానీ చంద్రబాబు మాత్రం రాహుల్ సభను విమర్శించడమే కాక, రాహుల్ సభకు వెళ్ళిన వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకులే అన్నట్టుగా మాట్లాడేశాడు. చంద్రబాబు నిర్ణయం కంటే కూడా పవన్ నిర్ణయమే బెటర్ అని అనిపించేలా చేశాడు.
విభజన టైంలో కాంగ్రెస్ అన్యాయం చేసింది. ఆ అన్యాయానికి బిజెపి వంత పాడింది. ఆ తర్వాత అభివృద్ధి జోడీ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు-మోడీ ఏం చేశారు? ఏం చేస్తున్నారు? మోడీ ప్రత్యేక హోదాకు మంగళం పాడేశారు. చంద్రబాబేమో మోడీకి భజన చేస్తున్నాడు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితుల్లో చంద్రబాబు లేడు. ఆ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చాలా సార్లు చెప్పుకున్నాడు. బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేస్తోందన్న విషయం కూడా చంద్రబాబుకు తెలుసు. అయినప్పటికీ ఎందుకో మోడీతో విభేదాలు తెచ్చుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేడు. ఎన్టీఆర్ కంటే ముందు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీకి భయపడినట్టుగా ఉంటోంది చంద్రబాబు వ్యవహారం. ఆ నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో మోడీపైన ఒత్తిడి తీసుకొచ్చి…మోడీని కార్నర్ చేసే ప్రయత్నాన్ని ఎవరు చేసినా సీమాంధ్ర నేతలందరూ కూడా సపోర్ట్ చేస్తేనే రాష్ట్రానికి ప్రయోజనకరం. కనీసం కనీసం వ్యతిరేకించకుండా అయినా ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ కాంగ్రెస్ బలపడుతుందేమో అన్న ఆలోచన బిజెపి పెద్దలకు కచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది. అలాగే జాతీయ స్థాయి పార్టీల నాయకులు, వివిధ రాష్ట్రాల నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే కచ్చితంగా బిజెపి డిఫెన్స్‌లో పడుతుంది. తెలంగాణా ఉద్యమ సమయంలో కెసీఆర్ చేసింది కూడా అదే. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ గాంధీ అనే కాదు….ఎవరు ప్రత్యేక హోదా కోసం పోరాడినా మద్ధతు ఇస్తానన్నా పవన్ కళ్యాణ్ నిర్ణయమే సబబుగా ఉంది. మోడీ మరీ కరివేపాకులా తీసిపడేస్తున్నాడని అంతర్గతంగా వాపోతున్న టిడిపి వారు కూడా కాస్త పవన్‌లా ఆలోచిస్తే బెటరేమో.