కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుంటూరు సభలో ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీకి కొత్త అర్థం చెప్పారు. చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డిలకు మోడీకి మధ్యన ఏ ప్రత్యేక ప్యాకేజీ కుదిరిందో గాని హౌదా గురించి పోరాటం మానేశారని చమత్కరించారు. హిందూత్వ భావజాలం చెప్పే మోడీని తిరుపతిలో దైవసన్నిధిలో ఎపి ప్రజలకు ఇచ్చిన మాట తప్పారని మరో సెంటిమెంటల్ చురక వేశారు. ప్రత్యేక హౌదా హక్కు తప్ప దయాభిక్ష గాని కానుక గాని కాదని ఒకటికి రెండు సార్లు చెప్పడం ద్వారా తమ ప్రభుత్వం కూడా అదేదో గొప్ప చేసిందన్న భావం కలిగించకుండా జాగ్రత్త పడ్డారు. పోలవరంకు జాతీయ హౌదా వున్నా రాష్ట్రమే నిర్మాణం చేయడం కమిషన్లకోసమేనని ఆరోపించి చప్పట్లు కొట్టించారు. 2019లో అధికారంలోకి వచ్చాక మొదట ఎపి హౌదా ఇవ్వడం జరుగుతుందంటూ వారి ఓట్లు పొందే ప్రయత్నం కూడా చేశారు. ఇతరులు వ్యతిరేకిస్తున్నందువల్ల హౌదా ఇవ్వడం లేదనే మాట నిజం కాదనడానికి వేదికపై వున్న వివిధ పార్టీల రాష్ట్రాల నాయకులను చూపించారు. మొత్తంపైన రాహుల్ ప్రసంగం బాగానే సాగిందని చెప్పాలి. కాంగ్రెస్ నాయకులలో ఈ మాత్రం ఉత్సాహం కనిపించి చాలా కాలమైంది. జగన్ను ముందుగా ప్రస్తావించడం ద్వారా రాహుల్ రెండు పార్టీల మధ్య ఏదో నడుస్తుందనే వూహాగానాలకు తెర దించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు.ఇక రాహుల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ రాజకీయ కక్ష తీర్చుకోవడం తప్ప ప్రజలు ఆమోదించలేరు. ఎందుకంటే బిజెపి నిరాకరించినప్పుడు ఇతర జాతీయ పార్టీల మద్దతు అవసరమే. మరి ఎందుకు జెండాలతో ప్రదర్శనలు చేసినట్టు? ఇప్పుడు బిజెపి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని వారు గతంలో కాంగ్రెస్ చేసిందంటూ అదేపనిగా ఆరోపించడం వల్ల ఉపయోగం ఏమిటి?