కేంద్రం చేతిలో మోసానికి గురైన నవ్యాంధ్ర ప్రదేశ్ జూన్ నాలుగో తేదీన మరోసారి అబద్ధాల పుట్టలను చూసింది. ఒక పక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరోపక్క కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ(రాగా) అబద్ధాల రాగాలను ఆలపించారు. నవ్యాంధ్ర దీక్షలో బాబు చెప్పిందే చెప్పగా.. 2019లో మేమొస్తే ఏపీ ప్రత్యేక హోదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. పార్లమెంటు తలుపులు మూసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను నిష్కర్షగా..దుర్మార్గంగా విభజించిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా చట్టాన్నీ చేసేసుంటే ప్రజలు కొద్దోగొప్పో నమ్మే అవకాశముండేది. అప్పుడు చేసిందంతా చేసి, ఇప్పుడు అన్యాయం జరిగిపోయిందంటూ ఏడవడం వెనుక కుట్రను అందరూ అర్థం చేసుకోగలరు. కాంగ్రెస్‌కు అన్ని సందర్భాలలోనూ ఆపన్న హస్తాన్నిచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే. ఆ విషయాన్ని మరిచి, రాష్ట్రాన్ని కత్తికో కండగా నరికేసి, యువత భవితను నిర్దయగా దునిమేసిన హస్తానికి మనస్సనేది ఉండదనీ, అది కేవలం గొర్రెను నరికేసే చేయనీ ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకుంది. ఎవరొచ్చి ఎన్ని తీపి కబుర్లు చెప్పినా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. రాగా చెబితే ఉన్న కొద్దిపాటి నమ్మకమూ కోల్పోతుందని తెలుసుకోవాలి. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియని రాహుల్‌కు ఇప్పుడు ఇంత తీయగా మాట్లాడ్డం ఎలా వచ్చింది. తప్పు చేశామన్న భావన వారిలో కొంచెం కూడా లేదు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. టీఆర్ఎస్ను విలీనం చేసేస్తానని తరవాత మొండిచేయి చూపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ పార్టీకి తగినవాడు.
నవ నిర్మాణ దీక్షలో చెప్పిందే చెప్పిన చంద్రబాబు.. తన విజయాలను చెప్పారే తప్ప కష్టాలను అణుమాత్రం ప్రస్తావించలేదు. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చామని చెప్పుకుంటున్న భూములతో రాజధానికి నిధులు సమకూర్చే దిశగా అడుగులేస్తున్న బాబు సర్కారు తాజాగా ఎమ్మెల్యేలందరికీ 700 గజాల స్థలాన్ని కట్టబెట్టడానికి యోచిస్తున్నట్లూ తెలుస్తోంది. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా తన సౌకర్యాలకోసం ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కారు సామాన్య ప్రజలకు తీపి కబుర్లు చెబుతూ స్వర్గం చూపిస్తోంది. ఇంతవరకూ పెట్టుబడులు మాటల్లోనే ఉన్నాయి.. తప్ప రాష్ట్రానికి చేరినవి లేవు. సగటు జీవికి ఒరిగిందీ లేదు. ప్రత్యేక హోదాకు మించి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చామంటున్న చంద్రబాబు అండ్ కో… ఎందుకు దానికి సంబంధించిన వివరాలను వెల్లడించడం లేదు. ఒక వేళ వచ్చినా తన అనుయాయులకు కాంట్రాక్టులిచ్చి, లబ్ధి చేకూరుస్తారు తప్ప ఏపీకి వెంటనే ఒనగూరే ప్రయోజనం శూన్యం. ఉద్యోగాలు లేక.. యువత తల్లడిల్లిపోవాల్సిందే. చంద్రబాబైనా… రాహుల్ గాంధీ అయినా చేయగలిగింది చెప్పాలి తప్ప.. కంటితుడుపు మాటలు కూడదు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి