బాహుబలి… ఈ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తమైపోయింది. సెలబ్రెటీలూ, సినిమా రంగానికి దూరంగా ఉన్నవాళ్లు కూడా బాహుబలి పేరు ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నారు. ఇండియా – పాక్ మ్యాచ్లోనూ చాలాసార్లు బాహుబలి పేరు వినిపించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్కి ఒకానొక వ్యాఖ్యాతగా వ్యవహరించిన వీరేంద్ర సెహ్వాగ్ చాలాసార్లు బాహుబలి పేరు ప్రస్తావించి ఆశ్చర్యపరిచాడు. ”బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు??” అంటూ ఓ సందర్భంలో రోహిత్ శర్మని ప్రశ్నించడం విశేషం. ”బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసింది గానీ.. కోహ్లి రోహిత్ శర్మని ఎన్ని సార్లు రనౌట్ చేశాడన్న ప్రశ్నకు సమాధానం దొరడం లేదు” అని సెహ్వాగ్ చమత్కరించాడు.
అయితే దానికి రోహిత్ మాత్రం సమాధానం చెప్పలేకపోయాడు. ”నేను బాహుబలి చూళ్లేదు.. అందుకే నాకు ఈ ప్రశ్నకు సమాధానం తెలీదు” అంటూ… దాటేశాడు. అయితే.. ఇండియన్ టీమ్ లో ఓ బాహుబలి ఉన్నాడట. అదే.. శేఖర్ ధావన్ తనయుడట. అతను ఎప్పుడూ ఎదుటివాళ్లపై పిడి గుద్దులు విసురుతూనే ఉంటాడట. అందుకే.. తనే పెద్ద బాహుబలి అని చమత్కరించాడు రోహిత్ శర్మ. ఓ తెలుగు సినిమా పేరు… ఇండియన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వినిపించడం, వ్యాఖ్యాతలు ప్రస్తావించుకోవడం.. నిజంగా గొప్ప విషయమే. బాహుబలి సాధించిన ఘనతల్లో ఇదొకటి.