ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ వైకాపా. అయితే, ప్రజల పక్షాన ఉద్యమాలు చేయడంలోనూ, ప్రభావవంతంగా ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసి పట్టడంలోనూ ఇప్పటికీ తడబడుతూనే ఉందని చెప్పాలి. ప్రత్యేక హోదా ఉద్యమాన్నే తీసుకుంటే.. నామ్ కే వాస్తే అన్నట్టుగానే దాన్ని నడుపుతూ వచ్చారు. నెలకో రెణ్నెల్లో సభలు ఏర్పాటు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పట్లో హోదా రావడం సాధ్యమయ్యే పనికాదనీ, దీన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడదామని కూడా డిసైడ్ అయిపోయారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఆశించిన స్థాయిలో ప్రతిపక్షం నడపలేకపోతోందన్నది వాస్తవం. హోదా కోసం భావసారూప్యత గల పార్టీలతో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధమంటూ జగన్ చాలా స్పీచుల్లో చెప్తుంటారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే… వైకాపా తప్ప కొన్ని పార్టీలు ఆ భావ సారూప్యత పేరుతో ఒకటౌతున్నాయి. ఆ పార్టీలకు కాంగ్రెస్ నాయకత్వం వహించేందుకు సిద్ధమౌతున్నట్టు రాహుల్ గాంధీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని సీఎం చంద్రబాబు ఎప్పుడో తేల్చేశారు. అయితే, తాజాగా రాహుల్ ఏపీకి రావడంతో మరోసారి ఆ చర్చ తెరమీదికి వచ్చినట్టయింది. శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, డీఎంకే నాయకులతోపాటు దేశంలోని మరికొన్ని పార్టీలు కూడా ఏపీ స్పెషల్ స్టేటస్ కు మద్దతుగా నిలిచి పోరాడతాయని రాహుల్ గాంధీ గుంటూరులో చెప్పిన సంగతి తెలిసిందే. హోదా ఇష్యూకి జాతీయ స్థాయిలోనే పరిష్కారం లభిస్తుంది కాబట్టి, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఈ అంశంలో లీడ్ తీసుకుంటోంది. 2019 ఎన్నికల్లో ఏపీలో ఇదే ప్రధానాంశంగా ప్రచారం చేసుకుంటుంది. ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఊపు రావాలంటే కిం కర్తవ్యం ఇదే. గత ఎన్నికల్లో ఘోరంగా తిరస్కరించిన ప్రజలను తమవైపు తిప్పుకోవడం కోసం ఈ హోదా అంశమే సరైంది. మరి, ఇప్పుడు వైకాపా ఏం చేస్తుంది..? హోదా కోసం పోరాడుతున్న కాంగ్రెస్ తో కలుస్తుందా..? లేదంటే, మరికొన్ని పార్టీలను వెంటేసుకుని హోదా కోసం పోరాడే మరో గ్రూప్ ను క్రియేట్ చేస్తుందా..?
ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కాంగ్రెస్ తో వైకాపా కలవడం అనేది కుదిరేపనికాదు. జగన్ ను చేరదీసే ధోరణిలో కాంగ్రెస్ కూడా లేదు. పైగా, హోదా రాకపోవడానికి కారకులుగా చంద్రబాబు, జగన్ లను ఒకే గాటన కట్టేసి కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. సో.. కాంగ్రెస్ విజన్ ఏంటో అర్థమౌతూనే ఉంది. మోడీ సర్కారు ఏపీకి అన్యాయం చేయడానికి కారణం అధికార, ప్రతిపక్షాల ఉదాసీన వైఖరే అంటూ ప్రచారానికి కాంగ్రెస్ వెళ్తుంది.
పోనీ.. సోలోగా చూసుకున్నా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన స్థాయిలో ఎమోషనల్ గా వైకాపా నడిపిందీ లేదు. చంద్రబాబును విమర్శించేందుకు పనికొచ్చే ఒక సాధనంగానే హోదా అంశాన్ని వైకాపా చూస్తూ వస్తోంది! ఏ హోదా ఇష్యూని అయితే వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకుందామని వైకాపా వెయిట్ చేస్తోందో… అదే హోదా అంశాన్ని కాంగ్రెస్ ఇప్పుడు ఓన్ చేసుకుంది. దీంతో ఈ ఉద్యమ ప్రస్థానంలో వైకాపా ఎక్కడుందనేది జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. హోదా అంశంపై ఇప్పుడు వైకాపా స్పందించాల్సిన అవసరం ఉంది.