లక్ష కోట్ల అవినీతి అంటూ నాయకులు మాట్లాడక ముందు అవినీతి విషయంలో ప్రజలు కాస్త సీరియస్‌గానే స్పందించేవాళ్ళు. ఇక మీడియాలో అవినీతి ఆరోపణలకు సంబంధించిన వార్తలు వస్తే నాయకులు కూడా వెంటనే స్పందించేవాళ్ళు. అయితే లక్ష కోట్ల అవినీతి అంటూ టిడిపి వాళ్ళు చేసిన హంగామాతో అవినీతి అన్నది సీరియస్ విషయం కాకుండా పోయిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అదే టిడిపి వాళ్ళు 2014 ఎన్నికలకు ముందు జగన్ 16లక్షల కోట్ల రూాపాయల అవినీతికి పాల్పడ్డాడు అంటూ ఆ కామెడీని పరాకాష్టకు తీసుకెళ్ళారు.
సోషల్ మీడియాలో హార్ష్ కామెంట్స్‌తో సహా ప్రతి విషయంలోనూ టిడిపి చూపించిన బాటలోనే నడుస్తున్న వైకాపా నాయకులు కూడా ఇప్పుడు అదే తరహాలో విమర్శలు చేయడానికి రెడీ అయిపోయారు. అది కూడా టిడిపి నాయకులు వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే జగన్‌పైనే ఎక్కువ ఆరోపణలు చేసినట్టుగానే వైకాపా జనాలు కూడా చంద్రబాబు కంటే లోకేష్‌నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఆర్థిక మేధావి(?) అని చెప్పి జగన్ చెప్పే ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి లోకేష్ నాలుగు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని తాజాగా ఆరోపించాడు. అది కూడా అన్ని విషయాల్లోనూ లోకేష్ సంపాదించిన అవినీతి సొమ్ము కాదు ఇది. కేవలం భూ మాఫియా ఒక్క విషయంలోనే లోకేష్ నాలుగు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడట. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచా…..లేక మూడేళ్ళ కాలంలోనే అనే విషయంలో ఆయన చెప్పలేదు కానీ మొత్తానికి మన నాయకులు అవినీతి అంశాన్ని ఎంత కామెడీ చేయాలో అంతా చేస్తున్నారు. ఆ తర్వాత ఆయా పార్టీల భజన మీడియా జనాలు ఎన్నికల్లో అవినీతి అనేది ఒక అంశమే కాదని, అవినీతి గురించి జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదని విశ్లేషణలు చేస్తూ పూర్తిగా లైసెన్స్ ఇచ్చేలా చేస్తున్నారు. అవినీతి విషయంలో ప్రజలను బకరాలను చేయడం కోసం నాయకులు, మీడియా జనాలు ఇంకా ఎన్ని వ్యూహాలు పన్నుతారో చూడాలి మరి.