ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ ఈనాటిది కాదు. గడచిన మూడేళ్లలో చాలాసార్లు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లే ఎప్పటికప్పుడు ఈ డిమాండ్ ను తెరమీదికి తీసుకొస్తూ ఉంటున్నారు. పార్టీకి యువ సారథ్యం అవసరమనీ, బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన తరుణమనీ చాలామంది సీనియర్లు సోనియా గాంధీపై ఒత్తిడి చేసిన సందర్భాలున్నాయి. ఇదే సమయంలో.. భిన్నమైన వాదనను కూడా వినిపించినవారు ఉన్నారు. రాహుల్ గాంధీకి మరింత రాజకీయానుభవం అవసరమనీ, కొన్నాళ్లు సమయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డవారూ ఉన్నారు. ఏదైతేనేం, ఇన్నాళ్లకు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ముహూర్తం కుదిరినట్టుగానే కథనాలు వినిపిస్తున్నాయి.
రాహుల్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ ఓ ఏడు నెలల కిందట జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు తీర్మానించారు. అయితే, అదే సమయంలో సోనియా గాంధీ అనారోగ్యానికి గరికావడంతో ఆమె మీటింగ్ కి రాలేకపోయారు. తరువాత ప్రతిపాదన అలానే ఉండిపోయింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడిలో దాని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనూహ్య ఓటమి ఎదురైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత జరిగిన తాజా సమావేశంలో రాహుల్ పట్టాభిషేకం గురించి ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలౌతుందని, అక్టోబర్ లో రాహుల్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమౌతోంది పార్టీ వర్గాలు అంటున్నాయి.
అయితే, ఉన్నట్టుండి ఇప్పుడే రాహుల్ కి పగ్గాలు ఎందుకు ఇవ్వబోతున్నట్టు అంటే… ఇది కాంగ్రెస్ మెగా వ్యూహంలో భాగం అని చెప్పాలి! 2019 ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోని భాజపాను ఎదుర్కోవాలంటే ఇప్పట్నుంచే సన్నాహాలు చేసుకోవాలని కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. దాన్లో భాగంగా దేశంలోని భాజపా వ్యతిరేక పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చి, ఒక మహా కూటమి తయారు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోందని సమాచారం. ఈ మహా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తే బాగుంటుందనేది వారి ఉద్దేశం. ఆలోచన అయితే బాగానే ఉందిగానీ, ఈ కూటమిలోకి వచ్చేవారు ఎంతమంది..? రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించేవారు ఎంతమంది అనేది వేచి చూడాలి. పైగా, రాహుల్ గాంధీ ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటోందనే సెంటిమెంట్ కూడా ఉంది. రాహుల్ నాయకత్వంపై కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వర్గం కూడా ఉంది! ఏదేమైనా రాహుల్ పార్టీ అధ్యక్షుడు కావడం అనేది ఎప్పటికైనా జరిగేదే. కానీ, పార్టీ బాధ్యతతోపాటు కొన్ని సవాళ్లను కూడా ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుందన్నది వాస్తవం.