అమరావతిలో వర్షం భారీ కురిసింది. దీంతో తాత్కాలిక సచివాలయంలోకి నీరు వచ్చి చేరింది. విపక్ష నేత జగన్ ఛాంబర్ లోకి నీళ్లొచ్చాయి. దీంతో ఈ అంశాన్ని వైకాపా తీవ్రంగా పరిగణిస్తూ విమర్శలకు దిగింది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అవినీతికి ఇదే నిదర్శనమంటూ విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. భారీ నిర్మాణాలకి ఆప్రాంతం అనుకూలంగా లేదని ఎంతమంది చెప్పినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెడచెవిన పెట్టారని వైకాపా శాసన మండలి పక్ష నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆ ప్రాంతంలోని కొండవీటి వాగు వల్ల ముంపునకు గురయ్యే అవకాశం ఉంటుందని గతంలో శివరామకృష్ణ కమిటీ చెప్పిందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇక్కడ భారీ భవనాలు నిర్మించకూడదని గ్రీన్ ట్రైబ్యునల్ కోర్టు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆయన అన్నారు.
ఇంతకీ, తాత్కాలిక సచివాలయంలోకి నీరెలా చేరిందనే అంశంపై అధికారులు వెంటనే స్పందించారు. భవన నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపాలు లేవంటూ కమిషనర్ శ్రీధర్ మీడియాతో చెప్పారు. వర్షం కురిసిన వెంటనే భవనాన్ని ఆయన పరిశీలించారు. సన్ రూఫ్ లోకి నీరు వెళ్లడం వల్లనే అది భవనంలోకి లీక్ అయిందని వివరించారు. ఇక, జగన్ ఛాంబర్ విషయానికొస్తే.. ఈ మధ్య కొన్ని ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తున్నారనీ, వాటి కోసం ఒక ఇనుప పైపును దించారనీ, దాని పైభాగం ఓపెన్ గా ఉండటంతో కొంత వర్షపు నీరు దాని ద్వారా ఛాంబర్ లోకి ప్రవేశించిందని చెప్పారు. ఈదురుగాలులు భారీ రావడం వల్లనే సన్ రూఫ్ లోకి నీరు ప్రవేశించిందనీ, ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సన్ రూఫ్ వాలును తగ్గిస్తూ కొత్త డిజైన్లు ఇచ్చామని ఆయన వివరణ ఇచ్చారు.
అయితే, దాదాపు రూ. 700 కోట్లతో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టారు. ఎప్పటికప్పుడు డిజైన్లు మారుస్తూ వచ్చారు. ఇప్పుడు సన్ రూఫ్ డిజైన్ మార్చాలని అధికారులే చెబుతున్నారు. భారీ ఈదురుగాలులు వస్తే ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని ముందుగా అంచనా వేయలేకపోయారా అనేదే ఇక్కడ ప్రశ్న. తాత్కాలిక సచివాలయంలోని నీరు చేరడం వెనక నిర్మాణంలో నాణ్యతా లోపాలు లేకపోవచ్చుగానీ.. నిర్వహణలో మాత్రం కనిపిస్తున్నాయి కదా! ఈ ఘటన చిన్నదే అయినా.. దీన్ని కాస్త సీరియస్ గానే తీసుకోవాలి. లేదంటే, తాత్కాలిక సచివాలయ నిర్వహణే ఇలా ఉంటే… రేప్పొద్దున్న శాశ్వత నిర్మాణాలు ఎలా ఉంటాయో అనే విమర్శను చంద్రబాబు సర్కారు ఎదుర్కోవాల్సి వస్తుంది.