చిన్న సినిమాకి సరికొత్త జీవం పోసిన దర్శకుల్లో తప్పకుండా తేజ పేరు ఉంటుంది. స్టార్లు లేకుండా కేవలం కథని, సంగీతాన్ని, సన్నివేశాల్లో బలాన్నీ ఎలివేట్ చేస్తూ విజయాల్ని అందుకొన్నాడు తేజ. అయితే తరవాత ఏమైందో… ఆమెరుపు కనిపించలేదు. రెగ్యులర్ ఫార్ములాలకూ, కమర్షియల్ కథలకూ వ్యతిరేకం అని చెప్పుకొనే తేజ – తాను మాత్రం ఒకే కథని తిప్పి తిప్పి చూపించడం విసుగు తెప్పించింది. తేజ సినిమాల్లో ప్రేమ – హింస కలగలిపి ప్రయాణం చేస్తుంటాయి. దాంతో.. కుటుంబ ప్రేక్షకులు ఎప్పుడో ఆయనకు దూరం అయిపోయారు. స్టార్ డమ్‌ని ఏనాడూ నమ్ముకోని తేజ.. అటువైపు అసలు దృష్టే సారించలేదు. తేజ సినిమాలన్నీ ఒకే మూసలో సాగిపోతున్నాయన్న విమర్శ రోజురోజుకీ ఎక్కువై… తేజ ‘తీత’తో అది నిజమే అని తేలడంతో తేజకి సామాన్య ప్రేక్షకులూ దూరంగా జరిగారు.
అయితే… ఇప్పుడొస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విషయంలో మాత్రం తేజ మారాడేమో అనిపిస్తోంది. తేజ సినిమాల్లో కనిపించే ప్రేమ, యంగ్ ఫిలాసఫీ, హింస… ఇవేం.. ‘నేనే రాజు నేనే మంత్రి’లో మచ్చకైనా కనిపించలేదు.టీజర్ కొత్తగా ఉంది. తొలిసారి తేజ ఓ పొలిటికల్ థ్రిల్లర్‌ని ఎంచుకొన్నాడు. సో.. తేజ నుంచి కొత్త సినిమా చూసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తన కథల విషయంలో రానా చాలా కేర్‌గా ఉంటాడు. ఈసారి సురేష్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్‌లో డీప్‌గా ఇన్వాల్వ్ అయినట్టు తోస్తోంది. ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ తెలియంది కాదు. విషయం లేదంటే.. ఎవ్వరిపైనా పైసా కూడా పెట్టుబడి పెట్టడు. తన కొడుకుని.. తేజ చేతుల్లో పెట్టాడంటే.. కచ్చితంగా ఈసారి తేజ సరికొత్త సినిమాతో సిద్ధమయ్యే ఉండాలి. టీజర్లో తేజ మారినట్టు తెలుస్తోంది. అయితే.. ఆ మార్పు థియేటర్లో సినిమా చూసినప్పుడూ ప్రేక్షకుడు అనుభవిస్తే.. తప్పకుండా తేజ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఓ హిట్‌ని తన ఖాతాలో వేసుకొన్నట్టే.