ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నానన్నచంద్రబాబు మాటలకు వర్షం గండికొట్టింది. చిన్నపాటి వర్షానికే తాత్కాలిక సచివాలయం వణికిపోయింది. తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో లోపాలు గురించి, చిన్న వర్షానికే పెచ్చులూడిపోవడం, నీళ్ళు కారడం, క్రాక్స్ రావడం గురించి టిడిపి అనుకూల మీడియా కూడా చిన్న సైజ్ వార్తలను ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వైకాపా కూడా వెంటనే రంగంలోకి దిగింది. జగన్ లేకపోయినప్పటికీ ఇష్యూని ఎంతలా హైలైట్ చేయాలో అంతా చేశారు. అయితే సాయంత్రానికల్లా టిడిపి కూడా వైకాపాకి సూపర్ ట్విస్ట్ ఇచ్చింది.
టిడిపి భజన మీడియాతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా తప్పును వైకాపావైపు మళ్ళించే ప్రయత్నం చేశారు. చిన్నపాటి వర్షానికే తాత్కాలిక సచివాలయంలోకి నీళ్ళు, నిర్మాణంలో బలహీనతలు బయటపడ్డాయి అంటూ ఉదయం అంతా వచ్చిన వార్తలు కాస్తా సాయంత్రానికి జగన్ కార్యాలయంలోకి నీళ్ళు అనే టర్న్ తీసుకున్నాయి. ఆ తర్వాత జగన్ కార్యాలయంలో పనిచేసే మనుషులే కావాలని పైపులు కోసేశారు అన్నట్టుగా పరోక్షంగా విమర్శలు చేయడం మొదలెట్టారు టిడిపి జనాలు, ఆ పార్టీ భజన మీడియా. సిఐడి ఎంక్వైరీ వేస్తున్నాం. నేరస్తులను బయటపెడతాం అనడంతోనే తమ వాదనకు బలం చేకూర్చుకున్నారు. మొత్తానికి సినిమా స్థాయి ట్విస్ట్ ఇచ్చి కొంతమందికైనా జగన్‌పైన అనుమానం వచ్చేలా, అలాగే టిడిపి మీడియా జనాలందరికీ కూడా జగన్‌ని కార్నర్ చేసేలా అవకాశాన్ని సృష్టించారు టిడిపి నేతలు. తునిలో రైలు తగలబడిన ఘటన విషయంలో కూడా టిడిపి ఇలాగే రియాక్ట్ అయింది. నెపం జగన్‌పైకి తోసేసింది. ఆ తర్వాత కాస్త హడావిడి చేశారు. కానీ ఇఫ్పటి వరకూ దోషులను చట్టం ముందు నిలబెట్టింది కూడా లేదు. అలాగే వాళ్ళకు శిక్షలు పడేలా చేసిందీ లేదు. ఇప్పుడు తాత్కాలిక సచివాలయం విషయంలో సేం డ్రామా మొదలెట్టారు. టిడిపి నేతలు, టిడిపి భజన మీడియా వాదనలో నిజం ఉండొచ్చు కాక. కానీ ఆ నిజాన్ని నిరూపించి చట్ట ప్రకారం జగన్‌ని కానీ, జగన్ పార్టీ మనుషులను కానీ శిక్షిస్తే ఎవ్వరికీ అనుమానాలు రావు కానీ కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం, జగన్‌పై బురద చల్లడం కోసం మాటలతో ఎదురుదాడి చేస్తూ ఉంటే మాత్రం టిడిపికే నష్టం. తుని విషయంలో ఇప్పటికీ నిరూపించలేకపోయిన టిడిపి నేతలు…..ఇప్పుడు తాత్కాలిక సచివాలయం విషయంలో అయినా వైకాపా జనాల తప్పును నిరూపిస్తారేమో చూడాలి మరి.