హైదరాబాద్ లో వెలుగు చూస్తున్న భూకబ్జాలపై కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. సరైన ఆధారాలు ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేందు లేదు అనే ధోరణిలో ముందుకెళ్తోంది. బంజారాహిల్స్ లో వందల కోట్లు విలువ చేసే భూమిని అక్రమంగా కాజేస్తున్న వ్యవహారం బయటపడి హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దీపక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, చంచల్ గూడ జైలుకు పంపడం కూడా సంచలనంగా మారింది. దీపక్ రెడ్డిపై గతంలో ఉన్న కేసుల్ని కూడా ఇప్పుడు తిరగదోడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది!
బంజారాహిల్స్ భూ కుంభకోణంలో అరెస్ట్ అయిన దీపక్ రెడ్డికి జేసీ స్వయానా మేనమామ! కాంగ్రెస్ నుంచీ తెలుగుదేశంలోకి జేసీతోపాటు తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, మేనల్లుడు దీపక్ రెడ్డిలు కూడా ఒకే ప్యాకేజీలో వచ్చినవారే. జేసీకి ఎంపీ సీటు, తమ్ముడికి ఎమ్మెల్యే టిక్కెట్, దీపక్ కు ఎమ్మెల్సీ పదవి అనే డీల్ తో వీరంతా టీడీపీలో చేరారు. ఇప్పుడు తన మేనల్లుడిని ఈ వ్యవహారం నుంచి బయటపడేసేందుకు జేసీ చాలా రకాలుగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో సాయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన ముందుగా ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఈ మధ్య జేసీ, బాబుల మధ్య టెర్మ్స్ కూడా కాస్త బాగున్నాయనే అంటున్నారు కదా! అయితే, ట్విస్ట్ ఇక్కడే పడింది. దీపక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో జేసీకి ఏపీ సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదట! ప్రాక్టికల్ గా ఆలోచించినా కేసీఆర్ సర్కారు వ్యవహారాల్లో.. మరీ ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో చంద్రబాబు జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. హైదరాబాద్ భూకబ్జాల గురించి చంద్రబాబు మాట్లాడితే… మరోసారి కేసీఆర్ తో కోరి వైరం పెంచుకున్నట్టే అవుతుంది కదా. తెలిసి తెలిసీ చంద్రబాబు అలాంటి పని ఎలా చేస్తారు..?
ఇక, జేసీ గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు కదా. ఆ పరిచయాలను ఈ సందర్భంలో వాడుకునే ప్రయత్నం చేస్తున్నారట. తెలంగాణకు చెందిన కొంతమంది ప్రముఖ కాంగ్రెస్ నేతలను సంప్రదించేందుకు జేసీ ట్రై చేశారు. అయితే, భూ కబ్జాల విషయంలో కేసీఆర్ సర్కారు చాలా సీరియస్ గా వ్యవహరిస్తూ ఉండటంతో… దీపక్ రెడ్డి అరెస్ట్ విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకునే పరిస్థితి లేదంటూ టీ కాంగ్రెస్ నేతలు కూడా జేసీకి మొండి చెయ్యి చూపినట్టు తెలుస్తోంది! మొత్తానికి, అటు చంద్రబాబుగానీ, ఇటు పాత పరిచయాలుగానీ ప్రస్తుతం జేసీకి అక్కరకు రావడం లేదన్నది వాస్తవం. నిజానికి, దీపక్ రెడ్డిపై ఇప్పటికే అనంతపురంలో కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా మరికొన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు పక్కా ఆధారాలతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయింది తన సొంత మేనల్లుడు కాబట్టి జేసీ మనోవేదనకు గురి కావడాన్ని తప్పుబట్టలేం. కానీ, చట్టం దృష్టిలో తప్పు చేసినవారికి శిక్ష పడాల్సిందే.