అధికార పార్టీకీ.. ప్రభుత్వానికి మధ్య ఉన్న సన్నని గీత ఎప్పుడో చెరిగిపోయింది! ఏ పార్టీ అధికారంలో ఉన్నా… ఆ భావజాలానికి అతీతంగా ప్రజలందరి బాగు కోసం ప్రయత్నించాలి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్! తాము ఏపని చేస్తున్నా.. అది తమ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అనే కోణం నుంచే పాలన జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజా చేసిన కొన్ని వ్యాఖ్యలు వింటే… ప్రభుత్వ పథకాలన్నీ ఉన్నవి జనోద్ధరణకి కాదు, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికే అన్నట్టుగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా రుణాలనీ, వెయ్యి రూపాయల పెన్షన్లనీ, రుణ మాఫీలనీ ఇలా కొన్ని పథకాలను చంద్రబాబు సర్కారు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా చాలామందికి లబ్ధి చేకూరుతోందనేది నిర్వివాదాంశం. అయితే, ఈ లబ్ధిదారుల నుంచి చంద్రబాబు చాలానే ఆశిస్తున్నారు! ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నవారంతా ప్రభుత్వానికి మద్దతు పథకాలని ఆయన కోరారు. ఆ మద్దతు రూపంలో ఇవ్వాలనేది కూడా చెప్పార్లెండి! లబ్ధిదారులంతా ఎన్నికలు జరిగే రోజున పోలింగ్ బూత్ వద్ద అందరికంటే ముందుగా రావాలనీ, అంతేకాదు.. ఓటు వేసేందుకు లైన్లో నిలబడినప్పుడు.. తన ప్రభుత్వం గెలుపు, తన గెలుపుగా భావించి పనిచేయాలంటూ కోరారు. రూ. 1000 పెన్షన్లు మేము ఇస్తుంటే, వందల్లో ఇచ్చేవారు అవసరమా అంటూ ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలకూ రైతులకూ రుణమాఫీలు ఇస్తున్నామనీ, ఇంకా ఎన్నో పథకాల ద్వారా ప్రజలకు లాభం చేకూరుతుంటే ఎన్నికల్లో సొమ్ము పంచేవారిని ఆదరించాల్సిన అవసరం ఏముంది అన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలు విన్నవారికి కలిగే అనుమానం ఏంటంటే… ప్రభుత్వ పథకాలకి తెలుగుదేశం పార్టీ ఫండ్ నుంచి సొమ్ము ఖర్చు పెడుతున్నారా అని! పథకాల లబ్ధిదారులంతా తమకే ఓటు వెయ్యాలని ఇప్పట్నుంచే చెబుతున్నారు. టీడీపీ సర్కారు పథకాలను అమలు చేస్తోంది కాబట్టి, దానికి బదులుగా ప్రజలు టీడీపీకి ఓట్లెయ్యాలని అంటున్నారు. అంటే, ప్రభుత్వాన్ని నడపడమూ సంక్షేమ పథకాలను అమలు చెయ్యడం అనేది తెలుగుదేశం పార్టీ ప్రజల పట్ల చూపిస్తున్న దాన గుణమో దాతృత్వమో అన్నట్టుగా ఆయన ధోరణి ఉంది!
పెన్షన్ల రూపంలో నెలకి రూ. 1000 ఇస్తుంటే, ఎన్నికల్లో ఎవరో ఇచ్చే మూడొందలూ ఐదొందల కోసం ఎందుకు లాలూచీ అని చంద్రబాబు అనడం మరీ విడ్డూరం! అంటే, ఇప్పుడిస్తున్న ఈ పెన్షన్లు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే టీడీపీ ఇస్తున్నట్టా..? అంటే, ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నట్టా..? ఎప్పుడో ఎన్నికల్లో ఐదొందలు కాదు, ఇప్పుడే మేం మీకు నెలకు రూ. 1000 ఇస్తున్నాం అంటే ఎలా అర్థం చేసుకోవాలి..? ప్రజలను కొన్ని కోట్ల ఓట్లుగా చూస్తూ పాలన సాగిస్తే ఇలాంటి మాటలే వస్తాయి! మేం మీ సంక్షేమం కోసం పథకాలు ఇస్తున్నాం, బదులుగా మీరు మాకు ఓట్లెయ్యండని ఎలా కోరతారు..? ప్రజాస్వామ్యంలో ప్రజలకు తలొగ్గి ప్రభుత్వాలు ఉండాలిగానీ, ప్రజల హక్కుల్ని శాసించి, ప్రభావితం చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఏమనుకోవాలి..?