డీజే విషయంలో అల్లు అర్జున్ చాలా కాన్ఫిడెట్గా ఉన్నాడు. పారితోషికం బదులుగా… మూడు జిల్లాల రైట్స్‌ని తన దగ్గర ఉంచుకొన్నాడంటే ఈ సినిమాని బన్నీ ఎంతగా నమ్మాడో అర్థం చేసుకోవొచ్చు. హరీష్ శంకర్ మేకింగ్, తన స్టైల్.. ఇవన్నీ బన్నీకి బాగా నచ్చేశాయని తెలుస్తోంది. సినిమాని అనుకొన్న బడ్జెట్లోనే పూర్తి చేసి, అనుకొన్న సమయానికి సిద్ధం చేయడంతో… బన్నీ దగ్గర ఫుల్లుగా మార్కులు కొట్టేశాడు హరీష్. తన సన్నిహితుల దగ్గర హరీష్ గురించి చాలా గొప్పగా చెబుతున్నాడట బన్నీ. చూస్తుంటే.. ‘డీజే’ అయిన వెంటనే.. హరీష్ తో బన్నీ మరో సినిమా ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదన్నది మెగా కాంపౌండ్వర్గాల మాట. అంతేకాదు… ఈ సినిమాని గీతా ఆర్ట్స్ లోనే తెరకెక్కిస్తారట. ఇప్పటికే దిల్‌రాజు హరీష్‌కి మరో సినిమా ఛాన్స్ ఇస్తున్నట్టు ఎనౌన్స్ చేసేశాడు. దిల్ రాజు సంస్థలో హరీష్ కి ఇది నాలుగో సినిమా అవుతుంది. అంటే.. డీజే వల్ల ఇప్పటికే హరీష్ ఖాతాలో రెండు సినిమాలు పడిపోయినట్టు. సాధారణంగా.. సినిమా విడుదలకు ముందు హైప్ కోసం ‘ఈ దర్శకుడితో మరో సినిమా చేస్తా’ అంటూ హీరోలు, నిర్మాతలూ ప్రకటించడం మామూలే. కాకపోతే… అదంతా పబ్లిసిటీ కోసం. అయితే ఈసారి మాత్రం – దిల్‌రాజు, బన్నీ హరీష్‌తో మరోసారి పనిచేయడానికి గట్టిగా తీర్మాణించుకొన్నార్ట. డీజే విడుదల అయిన తరవాత కూడా హరీష్‌పై అంతే కాన్ఫిడెన్స్‌గా ఉంటే.. హరీష్ పంట పండినట్టే.