రేపు (శుక్రవారం) గోపీచంద్ సినిమా – ఆరగుడుగుల బుల్లెట్ విడుదల కాబోతోంది. విడుదలకు ముందు.. హైడ్రామా నడుస్తోంది. ఈ సినిమా విడుదల ఆపేయాలని కొంతమంది ఫైనాన్సియర్లు విశ్వ ప్రయాత్నాలు చేస్తున్నారు. ఈ సాయింత్రానికల్లా.. బుల్లెట్ వస్తుందా, రాదా? అనే విషయాలపై ఓ క్లారిటీ వస్తుంది. ఈ సినిమాకి తాండ్ర రమేష్ నిర్మాత. ఆయన ఇప్పుడు అటు డిస్టిబ్యూటర్లకు, అటు ఫైనాన్సియర్లకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు. ఆర్థిక పరమైన లావాదేవీలన్నీ పీవీపీ చేతుల మీదుగానే జరుగుతున్నాయి. నిజానికి ఈ సినిమాతో నిర్మాత తాండ్ర రమేష్ నష్టపోయిందేం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. గోపీచంద్ – నయనతార – బిగోపాల్ అనే కాంబినేషన్ పేరు చెప్పి, సినిమా మొదలెట్టిన వెంటనే.. కొన్ని ఏరియాల్లో మంచి రేట్లకే అమ్ముకొన్నాడట. ఆ రోజుల్లోనే జీ తెలుగు కి శాటిలైట్ అప్పగించేశాడని తెలుస్తోంది. కన్నడ, హిందీ ఛానళ్లకూ డబ్బింగ్ రైట్స్‌కింద ఈ సినిమాని కట్టబెట్టేశాడట. అలా.. బుల్లెట్ పేరు చెప్పి తాండ్ర రమేష్ బాగానే డబ్బులు గిట్టుబాటు చేసుకొన్నాడని, ఇప్పుడు ఈ సినిమాని పీవీపీ చేతుల్లో పెట్టి తాను తప్పుకొన్నాడని తెలుస్తోంది. తాండ్ర రమేష్ దగ్గర హోల్ సేల్ రేటుకి ఈ సినిమాని తీసుకొన్న పీవీపీ… థియేటర్లనుంచి మంచి మొత్తానికే అడ్వాన్సులు రాబట్టుకొందట. సినిమా బాగా ఆడితే.. ముందు తన పెట్టుబడి తీసుకొని, అప్పుడు వచ్చిన లాభాల్ని తాండ్ర రమేష్‌కి అప్పగిస్తారు. అంటే… ఆ రూపంలోనూ నిర్మాత లాభపడినట్టే. మరి ఈ సినిమాకి అప్పులిచ్చిన వాళ్ల పరిస్థితేంటన్నదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న గొడవా… దాని గురించే.