ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది వైయస్సార్ సీపీ. అయితే, రాష్ట్ర విభజన జరిగి ఇన్నాళ్లు అవుతున్నా ఇంకా ఏపీలో పార్టీ కార్యాలయం పెట్టనే లేదు. పార్టీకి సంబంధించి అన్ని వ్యవహారాలూ హైదరాబాద్ నుంచే నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ కూడా హైదరాబాద్ లోనే ఉంటూ, ఏవైనా సభలూ సమావేశాలూ ఉంటే వెళ్లి వస్తున్నారు. విభజన తరువాత టీడీపీ ఎప్పుడో ఏపీకి వెళ్లింది. ఇతర పార్టీలు కూడా ఏపీ పార్టీ కార్యాలయాల్ని ఆంధ్రాలోనే పెట్టేసినా.. వైకాపా మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. ఏపీలో కార్యాలయం ఏర్పాటు చేయాలని చాన్నాళ్లుగా వైకాపా శ్రేణుల్లో కూడా డిమాండ్ వినిపిస్తోంది. కానీ, జగన్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అసెంబ్లీలో ఉన్న పార్టీలకు ప్రాధాన్యతా క్రమంలో భూములు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మధ్య నిర్ణయించారు. అయితే, దాన్ని కూడా జగన్ తిరస్కరించారు! కారణాలు ఏవీ చెప్పలేదుగానీ, ఇప్పటివరకూ ఏపీలో వైకాపా ప్రధాన కార్యాలయం ఏర్పాటు కాలేదు. అయితే, ఇన్నాళ్లకు ఈ వ్యవహారంపై కదలిక వచ్చినట్టు తెలుస్తోంది.
వైకాపాకు రాజకీయ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఈనెల ఒకటో తేదీ నుంచే ఆయన డ్యూటీ తీసుకున్నారు. వైకాపా గురించి ఆలోచించడం మొదలుపెట్టగానే… పార్టీ నేతల్ని ఆయన అడిగిన తొలి ప్రశ్న ఆంధ్రాలో వైకాపా కార్యాలయం ఎందుకు లేదు అని..? రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు అవుతున్నా అక్కడ కార్యాలయం ఎందుకు పెట్టలేదని ప్రశాంత్ ప్రశ్నించారట! ఏపీలో అధికారంలో కావాలనుకున్నప్పుడు అక్కడే కార్యాలయం ఉండాలనీ, అక్కడే ప్రతిపక్ష నేత ఉండాలనీ, లేదంటే ప్రజలు నమ్మకపోయే అవకాశం ఉంటుందని పార్టీ నేతలతో ప్రశాంత్ అన్నారట. సొంతం భవనం ఇప్పటికిప్పుడు ఉన్నా లేకపోయినా, అద్దె భవనంలోనైనా పనులు ప్రారంభించాలని ఆయన సూచించినట్టు చెబుతున్నారు.
దీంతో వైకాపా నేతలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో అద్దె భవనం కోసం వేట సాగిస్తున్నట్టు సమాచారం. ఓ రెండు భవనాలను గుర్తించారనీ, విదేశీ పర్యటనలో ఉన్న జగన్ తిరిగి రాగానే ఏదో ఒకటి ఫైనలైజ్ చేసి.. ఏపీ కార్యాలయాన్ని వెంటనే ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతోపాటు జగన్ ఇంటి కోసం కూడా మరో భవనాన్ని చూస్తున్నట్టు సమాచారం. పార్టీ భవనం నిర్మించేందుకు అనువైన స్థలాలను కూడా వైకాపా నేతలు అన్వేషిస్తున్నారు. మొత్తానికి, ఇన్నాళ్లకు ఈ విషయంలో వైకాపాలో కదలిక వచ్చింది. ప్రశాంత్ రావడంతో వైకాపా ప్రధాన కార్యాలయం విజయవాడకు తరలించడం దాదాపు డిసైడ్ అయినట్టే. ఈ మధ్యనే సాక్షి దిన పత్రిక ఏపీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే.