జేసీ బ్రదర్స్ మాటల తీరు, వ్యవహార శైలి చూస్తుంటేనే వాళ్ళు ఎలాంటి నాయకులో ఎవరికైనా అర్థమవుతుంది. ఇక వాళ్ళ అల్లుడు దీపక్ కూడా మామకు తగ్గవాడినేనని నిరూపించుకున్నాడు. అయితే దీపక్ విషయంలో చంద్రబాబు స్పందన మాత్రం సవ్యంగా లేదు. నారాయణరెడ్డిని కనీసం పార్టీ నుంచి అయినా వెంటనే సస్పెండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం మీనమేషాలు లెక్కపెడుతున్నాడు. బహుశా జేసీల భజనకు ఇంప్రెస్ అయ్యాడో లేక జేసీల రాజకీయ బలం అవసరమనుకుంటున్నాడో తెలియదు కానీ చంద్రబాబు చేస్తున్న తాత్సారం మాత్రం టిడిపికి నష్టం చేసేదే. ఒకవైపు పార్టీ నాయకులు ఎలాంటి తప్పులు చేసినా క్షమించను అని చంద్రబాబు ప్రతిరోజూ చెప్తూనే ఉన్నాడు. మరోవైపు టిడిపి నేతలు మాత్రం అన్ని రకాల తప్పులూ చేస్తూనే ఉన్నారు. నెల వ్యవధిలో కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలో అడ్డంగా బుక్కవ్వడం పార్టీకి నష్టం కలిగించేదే. వేల కోట్లకు అధిపతిని అని నామినేషన్ టైంలోనే చెప్పుకున్న దీపక్…..ఇప్పుడు ఆ వేల కోట్ల ఎలా సంపాదించాడు అన్న విషయాన్ని ససాక్ష్యంగా నిరూపించుకున్నాడు. దీపక్ని సస్పెండ్ చేసే విషయంలో చంద్రబాబు వెనకడుగు వేస్తే మాత్రం దీపక్ సంపాదించిన వేల కోట్లలో చంద్రబాబుకు ఎంత ఇచ్చి ఉంటాడు అన్న ఊహాగానాలకు బలం చేకూర్చినట్టవుతుంది.
ఇక దీపక్ అరెస్ట్ వార్త బయటకు వచ్చిన వెంటనే కొంతమంది టార్గెట్ రెడ్డి అన్న ప్రచారం లేవదీశారు. చంద్రబాబే రెడ్డీస్ని టార్గెట్ చేస్తున్నాడు అనే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. రెడ్డి కుల సంఘం సభలకు వెళ్ళి తనకు తోచినట్టుగా రెడ్డీస్ అంటే ఏదో గొప్ప అన్నట్టుగా మాట్లాడిన జేసీ వీళ్ళకు పూనినట్టు ఉన్నాడు. టార్గెట్ రెడ్డీస్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే భవిష్యత్లో తప్పులు చేసిన ఏ ఒక్కరిని అయినా అరెస్ట్ చేయాలంటే వాళ్ళ కులం ఏంటి? కుల బలం ఏంటి అని చూడాల్సిన పరిస్థితులు క్రియేట్ అయ్యేలా ఉన్నాయి. అత్యంత అమానుషంగా ఉన్న ఈ ‘టార్గెట్ రెడ్డి’ ప్రచారానికి ఎంత త్వరగా ఫుల్ స్టాప్ పెడితే అంత బెటర్. అయినా తప్పు చేసినవాళ్ళను ‘మా కులజనం’ అని సమర్థించుకోవడం ఏంటి? తప్పు చేసినవాళ్ళకు శిక్ష పడాలి అని కోరుకుంటున్న జనాభే శాతమే ఎక్కువ ఉన్నప్పటికీ ఈ కుల జనులు మాత్రం వాళ్ళకు ఉన్న దురభిమానాలను అందరికీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ముందు ముందు అయినా ఇలాంటి దుస్సంప్రదాయాలకు చెక్ పడుతుందేమో చూడాలి.