2019 ఎన్నికల కోసం తెరాస ఇప్పట్నుంచే ఒక్కో అడుగూ వ్యూహాత్మకంగా వేస్తోందని చెప్పాలి. తెరాస కాస్త వీక్ గా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. టి.ఆర్.ఎస్. కాస్త బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణ విషయంలో మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. దీన్లో భాగంగా గ్రేటర్ పరిధిలో 2019 సార్వత్రిక ఎన్నికల బాధ్యతల్ని మంత్రి కేటీఆర్ కు అప్పగించే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే, గ్రేటర్ ఎన్నికల బాధ్యతల్ని గతంలో కేటీఆర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో అనూహ్యంగా 99 స్థానాలను తెరాస దక్కించుకుంది. ఇదే ఊపును అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించేందుకు కేటీఆర్ సిద్ధమౌతున్నట్టు సమాచారం. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కేటీఆర్ ను పోటీలోకి దించితే బాగుంటుదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది!
గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లి నియోజక వర్గం నుంచి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. నిజానికి, కూకట్ పల్లిలో సెటిలర్లు సంఖ్య ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచీ తెలుగుదేశం ప్రభావమే అక్కడ ఎక్కువగా ఉంటూ వస్తోంది. గత ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థే గెలిచారు. టీడీపీ టిక్కెట్ పై గెలిచిన మాధవరం కృష్ణారావు.. తరువాత తెరాసలోకి ఫిరాయించారు. స్థానికంగా ఆయనకి మంచి పేరే ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటారనే ఇమేజ్ ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన పనితీరుపై కేసీఆర్ కాస్త అసంతృప్తిగా ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ వెలువరించిన గత రెండు సర్వేల్లోనూ ఎమ్మెల్యేలందరిలోనూ చివరి స్థానంలో కృష్ణారావు నిలవడం విశేషం!
సో… సర్వే ఫలితాలు ఇలా వస్తున్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయనకి తెరాస సీటు ఇవ్వడం అనుమానమే అని తెరాస వర్గాలే అంటున్నాయి. అయితే, ఆయన ర్యాంకు అనూహ్యంగా పడిపోవడం వెనక వ్యూహం ఇదే అని కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు. విద్యాధిక వర్గాల్లో కేటీఆర్ కు మంచి ఇమేజే ఉంది. సెటిర్లతో కూడా ఆయన బాగానే మెలుగుతున్నారు. సో.. కూకట్ పల్లి నుంచి ఆయన్ని బరిలోకి దించితే.. ఆ చుట్టుపక్కల మరికొన్ని నియోజక వర్గాలపై కూడా కేటీఆర్ ప్రభావం ఉంటుంది. ఇదే సీఎం కేసీఆర్ వ్యూహం అని చెబుతున్నారు. కూకట్ పల్లిలో కేటీఆర్ కు లైన్ క్లియర్ చేయడం కోసమే కృష్ణారావు ర్యాంకును ఉద్దేశపూర్వకంగా పడేస్తున్నారన్న విమర్శలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. ఏదేమైనా, కూకట్ పల్లి నుంచి కేటీఆర్ పోటీకి దిగడం నిజమే అయితే.. అది ఆసక్తికరంగా మారుతుందనడంలో సందేహం లేదు.