బాలీవుడ్ సినిమా రాబ్తాకీ, మగధీర టీమ్కీ కోర్టు బయటే సెటిల్మెంట్ జరిగిపోవడం, ఆ గొడవ సద్దుమనగడం తెలిసిన విషయాలే. మగధీర కథనీ, సన్నివేశాల్నీ రాబ్తాలో కాపీ కొట్టారని, ఆ సినిమాని విడుదల చేయకుండా ఆపాలని గీతా ఆర్ట్స్ కోర్టులో పిటీషన్ వేసింది. రాబ్తా విడుదల ముందు… ఈ వివాదం కాస్త సంచలనం సృష్టించింది. అయితే.. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరడంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడింది. అయితే ఫిర్యాదుని ఉపసంహరించుకోవడానికి గీతా ఆర్ట్స్ కి రాబ్తా టీమ్ భారీగా సొమ్ము ముట్టజెప్పిందన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ఉపసంహరణ విలువ రూ.2 కోట్ల నుంచి రూ5 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నాయి. అనుకొన్న సమయానికి రాబ్తా విడుదల కాకపోతే… నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే… కోర్టు బయటే సెటిల్ చేసుకోవడానికి రాబ్తా నిర్మాతలు సముఖత చూపించడంతో ఈ కాపీ గొడవ కి పుల్ స్టాప్ పడింది. రాబ్తా విషయంలో అల్లు అరవింద్ ఎత్తుగడలు ఫలించాయని, చిత్రబృందాన్ని ఇరుకున పెట్టి… తాను అనుకొన్నది సాధించగలిగాడని ఫిల్మ్ నగర్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోసారి… అల్లు అరవింద్ తెలివితేటలు, వ్యూహాలు.. బాగానే కలిసొచ్చాయి. ఈ వివాదంలో గెలుపు మాదే.. అని రాబ్తా టీమ్ ప్రకటించుకొంటున్నా – తెర వెనుక గెలుపు మాత్రం అల్లు వారిదే.