హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు – కరవు కవల పిల్లలని, గతంలో 2003లో ఆయన అధికారంలో ఉన్నపుడు కరవు వచ్చిందని, వైఎస్ రాగానే వర్షాలు పడ్డాయని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు కాబట్టే వర్షాలు కురవటంలేదని కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఇటీవల ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే నైరుతి రుతుపవనాల ప్రభావంతో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని జిల్లాలలోనూ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అటు ఉత్తరాంధ్రనుంచి ఇటు రాయలసీమలోని చిత్తూరు, అనంతపూర్, కర్నూలు జిల్లాల వరకు భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కరవు జిల్లా అయిన అనంతపూర్ జిల్లాలలో చెరువులు, వాగులు, వంకలు నీటితో పొంగిపొర్లుతున్నాయి. తమ కరవు తీరిపోయిందని అక్కడి రైతులు ఆనందపుడుతున్నారు.
మొత్తానికి ఈ ఆకస్మిక వర్షాలతో చంద్రబాబుపై కరవు విషయంలో ఉన్న నింద తొలగిపోయినట్లయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారో, లేదో చూడాలి.