కొత్త దర్శకుడు మెగా ఫోన్ పడుతున్నాడంటే.. కచ్చితంగా ఏదో ఓ ‘కొత్త’ ఆలోచనతో వచ్చాడనుకోవడం సహజం. పెళ్లిచూపులు లాంటి సినిమాలు చూశాక… ఆ `కొత్త`పై మరింత భరోసా కలగడం మన తప్పు కాదు. ‘కాదలి’ లాంటి టైటిల్.. రంగు రంగుల విజువల్స్, వీటన్నింటికి మించి ‘డి. సురేష్ బాబు నేతృత్వం’ ఇవన్నీ ‘కాదలి’పై కాస్త గురి కలిగించేలా చేశాయి. మరి కాదలి ఆ స్థాయిలోనే ఉందా..?? ఈ చిన్న సినిమా తనపై పెంచుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకొందా?? `కాదలి` కథా కమామిషూ ఏంటి??
* కథ
ఓ అమ్మాయి.. ఏక కాలంలో ఇద్దరు అబ్బాయిల్ని ఇష్టపడుతుంది. చివరికి వాళ్లలో ఒకర్ని జీవిత భాగస్వామిగా ఎంచుకొంటుంది. ఇదే కథ..
* విశ్లేషణ
కథేంటి? మరీ రెండు ముక్కల్లో తేల్చేశారు? మిగిలినవన్నీ ట్విస్టులూ, టర్నింగులేనా?? అనే అనుమానాలేం పెట్టుకోవొద్దు. ఆ రెండు లైన్లను మించిన కథ కాదలిలో భూతద్దం పెట్టుకొని వెదికినా కనిపించదు. ఇంతటి సింపుల్ కథతో దర్శకుడు ఓ సినిమాని మలిచాడంటే, దానిపై ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాడంటే… కథనంలో గానీ, పాత్ర చిత్రణలోగానీ ఏవో అద్భుతాలు ఆశిస్తాం! కానీ… అంత సీన్ కూడా లేదిక్కడ. సాధారణమైన కథల్ని సన్నివేశాలు, క్యారెక్టరైజేషన్లు ఓ స్థాయిలో నిలబెడతాయి. కాకపోతే ఆ ప్రయత్నం కూడా `కాదలి`లో జరక్కపోవడం శోచనీయం.
ఓ పుస్తకం రాస్తున్నప్పుడు కనీసం పదో పేజీ దగ్గరో పాతికో పేజీ దగ్గరో అసలు పాయింటుకు వచ్చేయాలి. లేదంటే అసలు ఈ పుస్తకం ఎందుకు చదవాలి? అని విసుగొచ్చి పుస్తకాన్ని అవతల విసిరికొట్టాలనిపిస్తుంది. సినిమా కూడా అంతే. నాలుగైదు సన్నివేశాలు దాటాక… ఏం చెప్పాలనుకొంటున్నాం?? అనే పాయింట్ దగ్గర రాక తప్పదు. `కాదలి`లో ఆ లక్షణాలేం కనిపించవు. సినిమా దాటి గంటైనా.. దర్శకుడు టేకాఫ్‌లోనే ఉండిపోయాడు. పోనీ.. అప్పటి వరకూ గమ్మత్తైన సన్నివేశాలతో వినోదం పంచాడా అంటే అదీ లేదు.
ఓ సన్నివేశంలో `నీకు పెళ్లయిందా` అని అబ్బాయిని అమ్మాయి అడుగుతుంది. అవును.. కాదు.. ఇలా ఒక్క ముక్కలో ఆన్సర్ ఇచ్చేయొచ్చు. కానీ హీరో మాత్రం ఓ భారీ జోక్ చెబుతాడు. అదీ నవ్వొచ్చేది కాదు లెండి. సింపుల్ గా తేల్చాల్సిన విషయానికి అంత నాన్ సెన్స్ ఎందుకు అనిపిస్తుంది. ఆ ఒక్క సన్నివేశంలోనే కాదు, సినిమా అంతా ఇలానే ఉంటుంది. హీరోయిన్ ఎప్పుడు ఏదో ఒకటి తింటూ కనిపిస్తుంది. ఓ హీరోఏమో.. ఇంట్లో ఫ్యాంట్లు లేనట్టు పట్టపగలు కూడా షార్ట్స్‌లో తిరిగేస్తుంటాడు. మరో హీరో అవసరం ఉన్నా – లేకున్నా.. తన డాంబికం చూపిస్తుంటాడు. ఇవే క్యారెక్టరైజేషన్లు అనుకోవాలా?? ఎవరి పాత్ర ఏంటి? ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? అనే విషయంలో దర్శకుడికైనా క్లారిటీ ఉందా? అనే అనుమానం వేస్తుంటుంది సినిమా చూస్తుంటే. ఓ అమ్మాయి ఇద్దరు అబ్బాయిల్ని చూసుకొని, అందులో ఒకడ్ని ఎంచుకోవడం కొత్త పాయింటేం కాదు. కాకపోతే నావెల్టీ ఉన్నదే. దాన్ని అందంగా ఆకర్షణీయంగా చూపించొచ్చు. అసలు దర్శకుడు అలాంటి ప్రయత్నమేమీ చేయలేదు. ప్రధమార్థానికే `శుభం` కార్డు పడిపోవాల్సినంత స్టఫ్ ఉన్న సినిమా ఇది. దాని కోసం సెకండాఫ్ కూడా చూడాల్సివస్తుంది. ఇక ఆ రెండో భాగం ఇంకెంత నిదానంగా సాగిందో అర్థం చేసుకోవొచ్చు.
గాఢత లేని సన్నివేశాలు, ఫీల్ లేని ప్రేమ, జీవం లేని పాత్రలు… ఇవన్నీ మిక్స్ చేస్తే.. `కాదలి` పుట్టింది.
* నటీనటులు
మూడు పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. కథ ప్రకారం కథానాయిక పాత్రకే ప్రాధాన్యం. అయితే ఆ పాత్రలో కనిపించిన పూజా తేలిపోయింది. హీరో పక్కన పూజా ఆనాలంటే… రెండు పెద్ద పెద్ద స్టూల్స్ ఒకదానిపై మరోటి పేర్చి నిలబడాల్సిందే. మరీ ఇంత బ్యాడ్ ఛాయిసా అనిపిస్తుంది. హీరో హీరోయిన్లను పక్క పక్కన పెట్టి చూపించాలనుకొన్నప్పుడు కెమెరా మెన్ కూడా తడబడిపోయాడు. ఆ ఫ్రేమింగ్ చూస్తే… కెమెరామెన్‌పై జాలేస్తుంది. హీరోయిన్‌కి తెలుగు రాదన్న విషయం సినిమా చూసే ప్రేక్షకుడికి ఈజీగా అర్థమైపోతుంది. ఒక్క డైలాగ్‌కీ లిప్ సింక్ అవ్వలేదు. అదేదో డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చేసింది. హీరోలిద్దరూ బాగా చేశారు.కానీ ఏం లాభం..?? ఏ క్యారెక్టర్‌కీ న్యాయం జరగలేదు.
* సాంకేతికంగా
కథ, కథనం, మాటలు… ఇవన్నీ సాధారణ స్థాయిలో ఉన్న సినిమాకి సాంకేతిక వర్గం మాత్రం ఏం చేయగలుగుతుంది. అయినా.. పాటలు బాగున్నాయి. మంచి పాటల్ని చెడగొట్టారేమో అనిపిస్తుంది. సినిమా క్వాలిటీ కూడా అంతంత మాత్రమే. డీఐ వర్క్ సరిగా చేయలేదు.
* ఫైనల్ టచ్ : ‘కాదలి’ ఓ తమిళ టైటిల్.. సినిమా కూడా అంతే. తమిళం అస్సలు రానివాడికి… గాఢమైన తమిళ యాసతో సినిమా చూపిస్తే ఎంత టార్చర్ ఉంటుందో.. ‘కాదలి’ సినిమా చూస్తే.. అచ్చం అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఏదో చెప్పాలనుకొని, ఏదేదో చూపించి, చివరికి ఏమీ చెప్పకుండా పంపించిన సినిమాల్లో ‘కాదలి’ తప్పకుండా ఉంటుంది.
తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5