మియాపూర్ భూ కుంభకోణం… ప్రస్తుతానికి ముగిసిపోయిన అధ్యాయం అన్నట్టుగానే అధికార పార్టీ కలరింగ్ ఇస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని తిప్పి కొట్టింది. కొంతమందిపై కేసులు పెట్టామనీ, ఆ కుంభకోణాన్ని ప్రభుత్వమే బయటపెట్టిందనీ, వేల కోట్ల విలువ చేసే భూములను అన్యాక్రాంతం కాకుండా సీఎం కేసీఆర్ చేశారంటూ అధికార పార్టీ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కుంభకోణం విషయంలో తెలుగుదేశం వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా లోతైన పరిశోధన చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి, ఆయన గతంలోనే కొన్ని ఆధారాలు బయటపెట్టారు. కానీ, వాటిపై ప్రభుత్వం స్పందించలేదూ… ప్రధాన మీడియాలో కూడా తగినంత ప్రాధాన్యత దక్కలేదు. అయితే, మియాపూర్ తోపాటు రంగారెడ్డి జిల్లాలో పలు భూభాగోతాలకు సంబంధించిన వివరాలను పెద్ద ఎత్తున సేకరిస్తున్నారన్న విషయం కొంతమంది పెద్దలకు ఒకింత గుబులు పుట్టించేలా మారుతోందని సమాచారం!
ఈ తరుణంలో, కొంతమంది పెద్దలు రేవంత్ తో రాయబారానికి ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అండదండలు దండిగా ఉన్న సదరు పెద్దలు, ఓ మీడియా అధిపతిని కలిశారట! భూకుంభకోణాల విషయంలో రేవంత్ ను కాస్త తగ్గమని చెప్పాలంటూ ఆయనకి విన్నవించారట! ఆ మీడియా అధిపతి కూడా రేవంత్ కి టచ్ లోకి వెళ్లారనీ, మియాపూర్ లాండ్ ఇష్యూని ఇక్కడితో వదిలెయ్యమంటూ సూచించారనీ చెప్పుకుంటున్నారు. అయితే, భూకుంభకోణాల విషయాన్ని తాను అంత ఈజీగా వదిలిపెట్టేది లేదని రేవంత్ తెగేసి చెప్పినట్టు కథనం. తాను సేకరించిన వివరాలను త్వరలోనే బయటపెట్టడం ఖాయమనీ, ఈ విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని రేవంత్ చెప్పినట్టు ఓ కథనం రాజకీయ వర్గాల్లో ప్రచారంలోకి వచ్చింది.
ఈ విషయంలో రేవంత్ అంత సీరియస్ గా ఉండటానికి కారణం… గతంలో రేవంత్ పై అధికార పార్టీ అనుసరించిన వైఖరే అని చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని పార్టీలూ ఫిరాయింపుల్ని ఎడాపెడా ప్రోత్సహించినవే. కానీ, ఓటుకు నోటు విషయంలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ భూ కుంభకోణాల అంశాన్ని ప్రధానాస్త్రంగా మలచుకుని అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. మియాపూర్ భూ కుంభకోణాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని, ఇతర అంశాలన్నీ పక్కనపెట్టి రాత్రింబవళ్లూ ఇదే పనిలో ఉన్నారు. కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు విమర్శలు చేసే రేవంత్… దొరికిన వివరాలేంటో త్వరలోనే బహిర్గతం చేస్తారంటూ టీ టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, రాబోయే రోజుల్లో మియాపూర్ భూదందా వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలకు కేంద్రబిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది.