చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాల వాడ నరసింహారెడ్డి’లో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే… చిత్రబృందం మాత్రం ఈ విషయంలో స్పందించడం లేదు. ‘అమితాబ్ నటిస్తున్నాడు’ అనో.. ‘నటించడం లేదు’ అనో చెప్పడం లేదు. కాకపోతే… ఈ సినిమాలో బిగ్ బీ స్థాయి నటుడు చేయాల్సిన పాత్ర ఒకటి ఉందని తెలుస్తోంది. అదే… ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్ర. ద్వితీయార్థంలో వచ్చే ఈ పాత్ర కు కథలో చాలా ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. ఆ పాత్ర అయితేనే బిగ్ బీకి సూటవుతుందని, బహుశా… ఆ పాత్ర కోసమే బిగ్ బీని సంప్రదించే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువుకీ చరిత్రలో ప్రాధాన్యం ఉంది. దాన్ని సినిమాటిక్‌గా మార్చి, పరిధి పెంచి.. అమితాబ్ లాంటి నటుడితో చేయిస్తే… సినిమా స్థాయి మారుతుంది. మరోవైపు ఈ చిత్రంలో కథానాయికగా ఐశ్వర్యరాయ్ నటించడం ఖాయమని సమాచారం అందుతోంది. ఐష్‌కి ఇటీవలే చిత్రబృందం స్క్రిప్టు వినిపించిందని, ఐష్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొందని, అందుకు గానూ.. రూ.6 కోట్ల పారితోషికం ముట్టజెబుతున్నారని తెలుస్తోంది. బిగ్ బీ కూడా ఈ ప్రాజెక్టులోకి అడుగుపెడితే… మామా కోడళ్లు కలసి నటించి తొలి దక్షిణాది చిత్రం.. ఇదే అవుతుంది.