తెలంగాణలో మియాపూర్ భూకుంభకోణం రాజకీయంగా ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తోందో చూస్తున్నాం. ప్రతిపక్షాల నుంచీ తీవ్ర ఆరోపణలు ఎదురౌతుంటే, వాటిని తోసిపుచ్చుతూ కేసీఆర్ వినిపిస్తున్న వాదన తెలిసిందే. ప్రభుత్వానికి సంబంధించి ఒక్క గజం భూమి కూడా అన్యాక్రాంతం కాలేదనీ, ప్రతిపక్షాల దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలనీ, చర్యలు తీసుకుంటామని కేసీఆర్ ఆ మధ్య చెప్పారు కదా. ఇప్పుడు ఇదే వాదనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వినిపిస్తున్నారు! మియాపూర్ విషయంలో కేసీఆర్ స్పందన ఎలా ఉందో… విశాఖ భూ కుంభకోణం ఆరోపణలపై చంద్రబాబు నాయుడు రెస్పాన్స్ కూడా అలా ఉంది.
విశాఖలో భూ కుంభకోణం అంశం తన దృష్టికి రాగానే వెంటనే చర్యలకు ఆదేశించానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి చర్యలకు ఆదేశించానని చెప్పారు. కానీ, ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ స్కామ్ కు సంబంధం ఉన్నవారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ‘విశాఖలోని 276 ఎకరాల విషయంలో ఏం జరిగిదంటే.. రికార్డ్స్ లో వారు రాసుకున్నారు. ట్రాన్సాక్షన్ జరగలేదు. అంతకుమించి అక్కడేం జరగలేదు, ఆ వివరాలు కావాలంటే ఎవరైనా చూసుకోవచ్చు‘ అని చంద్రబాబు చెప్పారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో కొంతమంది స్వార్థపరులు తాను ఒకటనుకుంటే అక్కడ మరొకటి చేశారనీ, వెంటనే దాన్ని రద్దు చేశానని ఆయన చెప్పారు. ఇంటి జాగాల పంపిణీ విషయంలో ఎంతో పారదర్శకంగా వ్యవహరించాననీ, ఆరువేల కోట్ల రూపాయాల విలువైన ఆస్తుల్ని ప్రజలకు ఇస్తే, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చంద్రబాబు అన్నారు. ఇలా ఎక్కడా ఎలాంటి లిటిగేషన్ కు అవకాశం లేకుండా తాను చేస్తుంటే, ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడమేంటన్నారు. ప్రతీవారం కోర్టుకు వెళ్తున్నవారు తమని ప్రశ్నించడమేంటన్నారు. ఆధారాలు ఉంటే సిట్ కి ఇవ్వండీ, లేదంటే మీడియాకి ఇవ్వండీ, చర్యలు తీసుకుంటా కదా అంటూ చంద్రబాబు చెప్పారు.
ఇదే భూకుంభకోణంలో తమ పార్టీ పెద్దలే ఉన్నారన్నట్టుగా మంత్రి అయ్యన్న పాత్రుడే గతంలో విమర్శించారు. భుజాలు తడుముకుంటూ మరో మంత్రి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపై ఆరోపిస్తూ సీఎంకి లేఖ రాశారు. అధికార పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. అంతర్గతంగా పెద్ద పంచాయితీనే నడించింది! వాటిపై చంద్రబాబు స్పందించలేదు. విశాఖ భూముల విషయంలో కుంభకోణంలో ఉన్నవారిని వదలొద్దని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఎవ్వర్నీ వదిలేదని చంద్రబాబూ అంటున్నారు! మియాపూర్ భూముల విషయంలో కేసీఆర్ ఎలా వ్యవహరించారో చంద్రబాబు అదే బాటలో మాట్లాడుతున్నట్టుగానే ఉన్నారు.