‘మీ సూచన మేరకే దళిత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం. మీ సహకారం కావాలి’……రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసిన వెంటనే కెసీఆర్కి ఫోన్ చేసిన మోడీ చెప్పిన మాటలు ఇవి అని కెసీఆర్ ప్రాపకం కోసం పాకులాడుతున్న తెలుగు నంబర్ ఒన్ పత్రిక చెప్పుకొచ్చింది. ఇక రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడిని ఎంపిక చేశారు అని నిన్న అందరితో పాటు తెలుసుకున్న మరుక్షణం నుంచీ టీఆర్ఎస్ నేతలు, సోషల్ మీడియా స్పాన్సర్డ్ టీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. నరేంద్రమోడీతో పెట్టుకోవాలంటే దేశంలో పెద్ద పెద్ద నాయకులే కాదు, బిజెపిలో ఉన్న పెద్దలు కూడా భయపడుతున్న పరిస్థితి. మోడీ, అమిత్ షాలు తీసుకునే నిర్ణయాలకు ఎవ్వరూ అడ్డుచెప్పలేని పరిస్థితి. మరి ఆ స్థాయి నాయకుడికి కెసీఆర్ సలహా ఏం అవసరమొచ్చింది? అయినా ఒకరి సలహాతో రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితుల్లో మోడీ ఉన్నాడా? ఒకవేళ కెసీఆర్కి మోడీ అంతటి ప్రాధాన్యతను ఇచ్చే పరిస్థితి ఉంటే …మరి కెసీఆర్ ఎందుకు…అందరికంటే ముందే నా మధ్ధతు మీకే…నా మద్ధతు మీకే అని పదే పదే మోడీ మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నాడు? ఇక కవితను కేంద్ర మంత్రిగా చూసుకోవడం కోసం తెరవెనుక కెసీఆర్ చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిన విషయమే.
తెలంగాణా వచ్చిన వెంటనే టీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే కెసీఆరే ముఖ్యమంత్రి అన్న విషయం అందరికీ తెలుసు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసమే తెలంగాణా పాట ఎత్తుకున్నాడు అన్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలనుకున్న కెసీఆర్ తెలంగాణా తొలి ముఖ్యమంత్రి దళితుడే అని హామీ ఇచ్చేశాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణావాదులను రెచ్చగొట్టడానికి సీమాంధ్ర బూచీని చూపెట్టినట్టుగానే మరోసారి సీమాంధ్ర బూచీని చూపెట్టి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేశాడు. దళితుడు అయితే సీమాంధ్ర బూచీని ఎదుర్కోలేడు అని చెప్పేశాడు. హామీ ఇచ్చినట్టుగా దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోగా…..దళిత ముఖ్యమంత్రి అయితే తనంత సమర్థవంతంగా పరిపాలించలేడు అని మరోరకంగా కూడా అవమానించాడు. ఆ విషయం దళితులకు ఎక్కడ గుర్తుందో అని కెసీఆర్ అండ్ కో భయం. అందుకే ఇప్పుడు దళిత రాష్ట్రపతి క్రెడిట్ కొట్టేయడం కోసం మోడీ ముందే కుప్పిగంతులు వేస్తున్నారు. కనీసం కరడుగట్టిన కెసీఆర్ మద్ధతుదారులైనా ఈ వాదనను నమ్ముతారా?