మీకు గుర్తుందా? రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి, ప్రధాని అందరి పేర్లూ తానే ప్రకటించానని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ అంటుండేవారు. అది యునైటెడ్ ఫ్రంట్ కాలం. హరికిషన్ సింగ్ సూర్జిత్, జ్యోతిబాజు, విపిసింగ్ వంటి హేమాహేమీలు వుండి కూడా యువకుడు ఉత్సాహవంతుడు అని చంద్రబాబును ప్రోత్సహించి ముందు నిలిపారు. ఆ కసరత్తులన్నీ ఆయనకు అప్పగించారు. ఈ నేపథ్యాన్ని వదిలేసి తనే వారిని ఎంపిక చేసినట్టు చంద్రబాబు చెబుతుంటారు. అది ఆయన ఇష్టం. కాని ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో ఆయన పాత్ర ఏమిటి అని చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అసలు రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ ను ఎంపిక చేశాక బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడే బాధ్యత ప్రధాని మోడీ ఆయనకు అప్పగించారని బాక్సులు కట్టి వేశారు. ఇప్పుడు నామినేషన్ల సెట్‌పై రెండవ సెట్‌పై ఆయన సంతకం చేశారని మరో కథనం. గతంతో పోలిస్తే కేంద్రంలో చంద్రబాబు స్థానం ఎలాంటి మార్పునకు లోనైందో దీన్నిబట్టే తెలుస్తుంది. మరోవైపున టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డికి తొలిసారిగా తన స్థానాన్ని చాటుకునే అవకాశం లభించింది. ఎందుకంటే ఇప్పటి వరకూ అన్ని సందర్భాలలోనూ కవిత, వినోద్ కుమార్ వంటి వారి పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయని ఆయనపై జోకులేస్తుంటారు. మీ సూచన మేరకే దళిత నేతను ఎంపిక చేశానని మోడీ ఫోన్లో టి ఎస్ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చెప్పడం కూడా గొప్ప ప్రచారం చేశారు. మోడీ మర్యాద కోసం దౌత్యనీతితో చెప్పిన మాటకు నిజంగానే రాజకీయ ప్రాధాన్యత నివ్వడం విచిత్రమే. ఎందుకంటే దళిత బలహీన వర్గాల వ్యక్తినే ఎంపిక చేస్తారని దేశమంతటికీ తెలుసు.అసలు అభ్యర్థి తేలకముందే వీరు బలపర్చారని అందరికీ తెలుసు. ఏది ఏమైనా కేంద్రంలో మరో పార్టీ ప్రభుత్వం వున్నా రెండు తెలుగు రాష్ట్రాలూ ప్రధానిని ప్రసన్నం చేసుకోవడానికి పాకులాడ్డం హాస్యాస్పదం. బలపర్చడం వేరు, గొప్పలు చెప్పుకోవడం వేరు.