ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావును నియమించడంలోనూ హఠాత్తుగా తొలగించడంలోనూ పైకి తెలియని ఏదో మతలబు వుందని టిడిపి వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆయనకు ఇతర పదవులు ఇచ్చే అవకాశం వున్నా- అక్కడ పదవీ విరమణ కాకముందే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? తర్వాత ఆయన హయాంలో కార్పొరేషన్ అంతర్గత వ్యవహారాలపై మేము అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు ఉపేక్షించారు? అపాయింట్మెంట్ నిరాకరిస్తూనే మరోవైపు గౌరవ మర్యాదలు ఎందుకు కొనసాగించారని టిడిపిలో సబంధిత వర్గాల నాయకులే ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్లో క్రెడిట్సొసైటీ ఏర్పాటుసెరికాదని చెబుతున్నా ముఖ్యమంత్రి వెళ్లి ప్రారంభించారు. తన సహాయకులుగా ఇద్దరికి(వారిలో ఒకరు అల్లుడు) భారీ జీతాలిస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మరి వాటితో పోలిస్తే పోస్టింగుల సమస్య చాలా చిన్నదే.. అయినా సరే ఆగమేఘాల మీద తొలగించడం పార్టీ వారినే ఆశ్చర్యపరచింది. అయితే కొద్దిరోజుల పాటు ఆయనపై మరీ తీవ్రంగా దాడి చేయొద్దని పార్టీ వారికి సూచనలు అందాయట. ఇదంతా చూస్తుంటే లోలోపల ఏవో మాకు తెలియని కారణాలు వుంటాయని టిడిపి నాయకులు చెబుతున్నారు. కొసమెరుపు ఏమంటే ఐవైఆర్ రేపు బిజెపిలో చేరే అవకాశం వుండటం. అప్పుడది మిత్ర పక్షంగా వుంటుంది గనక మళ్లీ మోయవలసిందే.కనుక ఇదంతా రెండందాలా నష్టమని ఒక నాయకుడు వాపోయారు.