చిరంజీవితో సినిమా తీయాలని ప్రతి దర్శకుడూ కల కంటుంటాడు. ఆమధ్య చిరు రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల.. చిరు కోసం కథలు రాయడం తగ్గింది. అయితే మళ్లీ చిరు సినిమాలపై దృష్టి పెట్టడంతో చిరుకోసం కలలు కంటున్న, కథలు వండుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఆ లిస్టులో హరీష్ శంకర్ చేరిపోయాడు. ఆల్రెడీ మెగా కుటుంబంలో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, సాయిధరమ్‌లతో సినిమాలు చేసేసిన హరీష్ శంకర్.. ఇప్పుడు చిరుకి గాలం వేసే పనిలో పడ్డాడు. చిరుతో పనిచేయాలన్నది తన కల అని, చిరు కోసం ఓ కథ కూడా సిద్ధం చేసుకొన్నానని చెప్పుకొచ్చాడు హరీష్.
దొంగమొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్‌లీడర్.. ఈ సినిమాల్లో చిరు పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకొని హరీష్ ఓ కథ అల్లాడట. చిరంజీవి క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుందని, ఎంటర్‌టైన్‌తో ఆ పాత్ర సాగుతుందని, చిరు ఓకే అంటే కథ వినిపించడానికి తాను రెడీ అని అంటున్నాడు హరీష్ శంకర్. అంతేకాదు.. ఈ సినిమా పట్టాలెక్కితే చిరు 150వ సినిమా గురించి ఎంతగా ఎదురుచూశారో, ఎంతగా మాట్లాడుకొన్నారో – తన సినిమా గురించి కూడా అలానే మాట్లాడుకొంటారన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు. చిరు దగ్గర్నుంచి హరీష్ కి పిలుపు రావాలంటే.. పెద్ద కష్టమేం కాదు. తన చేతుల్లో ఉన్న డీజేని హిట్ చేస్తే చాలు. అమాంతం.. చిరు నుంచి కాల్ వచ్చేయొచ్చు. చిరంజీవి – హరీష్ శంకర్ ల కాంబో సెట్ అవ్వాలంటే.. డీజే హిట్టవ్వడం కంటే మరో అత్యుత్తమమైన మార్గం లేదు. మరి.. హరీష్ ఆ మ్యాజిక్ చేయగలడా??