తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తన మార్కు ఉండాలనుకుంటారు! అంతేకాదు, ఆయన తీసుకున్న నిర్ణయానికి ఏదో ఒక సెంటిమెంట్ జోడించి, ప్రజలకు కనెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. తన నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం ప్రతిపక్షాలకూ లేకుండా చేస్తారు! తాజాగా అలాంటిదే మరో నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే… అతి పెద్ద అమరల వీరుల స్థూపాన్ని నిర్మించాలని. అదేంటీ, ఇప్పటికే అమర వీరుల స్థూపం ఉంది కదా అంటారా! అవును ఉంది.. అది అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులో ఉంది. ఒక స్థూపం ఉన్నప్పుడు ఇంకోటి ఎందుకూ.. అదీ ఇదే ఒకటే అవుతుంది కదా! అంటే, ఇది కేసీఆర్ కట్టిస్తున్నారుగా!
తాజాగా కేసీఆర్ సర్కారు నిర్మించబోతున్న అమర వీరుల స్థూపానికి చాలా ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. దాదాపు 200 అడుగులు ఎత్తులో దీని నిర్మించబోతున్నారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న లుంబినీ పార్కులో దీని కోసం ప్రత్యేకంగా రెండు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సాగర్ ఒడ్డున ఆరు అంతస్థులు భారీ భవనం నిర్మించి, దానిపై స్థూపాన్ని ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ కల. అంతేకాదు, ఈ భవనానికి అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది. 350 కార్లు పట్టేంత విశాలంగా నిర్మిస్తారు. ఒక్కో అంతస్థులో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక అంతస్తులో ఆడిటోరియం. ఇంకో దాన్లో ఆర్ట్ గ్యాలరీ, మరో అంతస్థులో ప్రదర్శన శాల ఉంటాయి. ఆరో అంతస్థులో పర్యాటకులను అనుమతిస్తారు. అయితే, ఇంత భారీ నిర్మాణానికి బడ్జెట్ కూడా భారీగా ఉండాలి కదా! ప్రస్తుతానికి రూ. 80 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి పూర్తి చేయాలనుకుంటున్నారు.
సో… తెలంగాణలో అతిపెద్ద అమర వీరుల స్థూపాన్ని నిర్మించిన క్రెడిట్ గోస్ టు సీఎం కేసీఆర్! ఆయన ఆశిస్తున్నదీ ఇదే అనడంలో సందేహం లేదు. ఈ కట్టడం సెంటిమెంట్ పరంగా ప్రజలను ఎట్రాక్ట్ చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! నిజానికి, కేసీఆర్ లక్ష్యం కూడా అదే. ఇలానే, ఆ మధ్య అతిపెద్ద జెండా పోల్ ను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ఖర్చు చేశారు. అయితే, అది మూణ్ణాళ్ల ముచ్చటే అన్నట్టుగా నిర్వహణ ఉంటోంది. ఇప్పుడు దాదాపు అలాంటిదే మరో మరో రిచ్ కల కంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే, ఇలాంటి నిర్మాణాలను ఎవ్వరూ తప్పుబట్టరు. కానీ, ప్రజాధనం ఖర్చు చేసి, ఇలాంటి పనులు చేయడం, ఆ తరువాత.. అదేదో తన వ్యక్తిగత ఘనతగా ప్రచారం చేసుకోవడం అనేదే జరుగుతుంది. ప్రాధాన్యతా క్రమంలో ఆలోచిస్తే దాదాపు రూ. 100 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ లో చేయాల్సిన పనులు చాలా ఉంటాయి కదా! ఆల్రడీ ఒక అమర వీరుల స్థూపం ఉన్నప్పుడు.. మరొకటి ఎందుకనే విమర్శలు వినిపిస్తాయి కదా!