బీహార్ అసెంబ్లీ ఎన్నికలు గంట మ్రోగడంతో ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీ లేదా కూటమి అధికారంలోకి వస్తుందో అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అందుకే వివిధ మీడియా సంస్థలు కూడా రంగంలోకి దిగి సర్వేలు చేయడం మొదలుపెట్టాయి. ఈ నెల మొదటివారంలో ఇండియా టీవీ- సి ఓటర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో నితీష్ కుమార్ నేతృత్వం వహిస్తున్న జనతా పరివార్ పూర్తి మెజార్టీతో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు తేల్చి చెప్పింది. ఆ రెండు సంస్థలు కలిసి మొత్తం 243 నియోజక వర్గాలలో 10,638 మందిని సర్వే చేసి ఫలితాలు ప్రకటించాయి. ఆ సర్వే నివేదిక ప్రకారం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లకు చెందిన జనతా పరివార్ కూటమి సుమారు 116-132 సీట్లు గెలుచుకోవచ్చని, అదే విధంగా ఎన్డీయే కూటమి సుమారు 94-110 సీట్లు వరకు గెలుచుకోవచ్చని తెలిపింది. ముఖ్యమంత్రి ప్రాధాన్యతపై అడిగిన ఒక ప్రశ్నకు 53శాతం మంది నితీష్ కుమార్ వైపు మ్రోగ్గు చూపగా కేవలం 18 శాతం మంది ప్రజలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుషీల్ కుమార్ మోడీ వైపు మ్రోగ్గారు. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడిపోతున్న ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కి కేవలం 5శాతం మంది ప్రజలు మాత్రమే మ్రోగ్గు చూపారు.