2014 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని విధాల ప్రయాస పడుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ ఆయన పట్ల పెద్ద ఆసక్తి చూపడం లేదు. ప్రత్యేకహౌదా నిధుల విడుదల వంటి విషయాలు పక్కనపెట్టినా వ్యక్తిగతంగానూ పొడిపొడిగానే సరిపెడుతున్నారని తెలుస్తూనే వుంది. తాజాగా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో ఇద్దరు తెలుగు సిఎంల పరిస్థితి నిన్న చెప్పుకున్నాం. ఇద్దరిలోనూ మొగ్గు ఒకింత కెసిఆర్ వైపేనని మోడీ సంకేతం ఇవ్వడం ఆసక్తికరం. ఆయనను కుశల ప్రశ్నలు వేస్తూ వానల గురించి అడిగారట. కెసిఆర్ బాగా పడ్డాయని చెప్పడం అప్పుడే చంద్రబాబు ఎపిలో అంతగా వానలు లేవని చెప్పడం జరిగిందట. కాస్సేపు ఇతర రాష్ట్రాల వర్షాల విషయమూ ముచ్చటించారు. ముక్తాయింపుగా మోడీ కెసిఆర్ ఎప్పుడూ ప్రాజెక్టులూ నీళ్లూ సాగునీరు తాగునీరు వంటి వాటి గురించే ఆలోచిస్తుంటారు గనక వర్షాలు బాగా పడుతున్నాయని చమత్కరించారట. నిజంగా కెసిఆర్ ఏం చేస్తున్నారనేది ఒకటైతే ఇది చంద్రబాబుకు ఒకింత కారంగా వుండే విషయమే. మామూలుగా ఆయన వుంటే వానలు రావని వైసీపీ నేతలు అర్థం లేని ప్రచారం చేస్తుంటారు.వైఎస్ వుండగా వానలు పడటం కూడా ప్రచారంలో వాడుకునేవారు. టీవీ చర్చలలో ఎవరైనా అంటే మేము అదేం లేదని సర్దిచెబుతుంటాము గాని ఇప్పుడు కూడా ఎపిలో కొన్ని చోట్ల అలాటి వాదనలు నడుస్తున్నాయి. ఇలాటి నేపథ్యంలో సాక్షాత్తూ మోడీ కూడా ఆ ప్రస్తావన తెచ్చి కెసిఆర్‌కే కితాబివ్వడం ఎంతైనా కష్టమే కదా…ఇంతకూ ఈ వార్త ప్రముఖంగా ఇచ్చింది కెసిఆర్ పత్రిక కాదు, ఈనాడు… కాకపోతే హైదరాబాద్ ఎడిషన్‌లో కెసిఆర్‌కు ప్రశంస లాగా ఇచ్చి ఎపిలో ఇద్దరితో సంభాషణ అని శీర్షిక మార్చారు. సో ఎవరి జాగ్రత్తలో వారుంటారన్నమాట….రాష్ట్రపతి ఎన్నికల వరకూ మోడీ కొత్త మిత్రులను మరింత బాగా చూసుకుంటారనడానికి ఇదో ఉదాహరణ.