విశాఖ పట్టణంలో భూ కుంభకోణమే జరగలేదని కనుక సిబిఐ విచారణ అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ప్రకటించారు. ఈ విషయంలో లేనిపోని ఆరోపణలు చేయడం మంచి సంప్రదాయం కాదని ఖండించారు. ఎవరో కొందరు రికార్డులను ట్యాంపరింగ్ చేస్తే తాము చర్యలు తీసుకుంటున్నామని సమర్థించుకున్నారు. కాంగ్రెస్ నేతలు తప్పులు చేసి తమను విచారణ జరపాలని కోరడం సరికాదని కూడా వ్యాఖ్యానించారు. ఇక్కడ రెండు సమస్యలేమంటే ఆరోపణలు చేసింది స్వయానా ఆయన మంత్రివర్గ సభ్యుడైన అయ్యన్న పాత్రుడు కాగా న్యాయ విచారణ కోరింది మరో మంత్రి గంటా శ్రీనివాసరావు. ఉభయులూ బహిరంగంగానే ఇదంతా చేశారు. మరి ముఖ్యమంత్రి మాటలను బట్టి వారు తప్పు చేసినట్టా? అయితే ఎందుకు చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షాలను అంటున్నారు? తమాషా ఏమంటే ఇదే సమయంలో మొదట ఈ సమస్యను కదిలించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌తోనూ ఛానళ్లలో ఇదే చెప్పించారు.
ఇక్కడ గుర్తుకు వచ్చేది తెలంగాణలో హౌరెత్తిపోయిన మియాపూర్ తదితర భూ కుంభకోణాలు.అవి కూడా ప్రభుత్వ ఆమోదంతోనేవెలుగులోకి వచ్చాయి. పాలకపార్టీలో ప్రస్తుతం భాగస్వాములుగా వున్న కె.కేశవరావు వంటివారు పాక్షికంగా పొరబాటు ఒప్పుకున్నట్టు లావాదేవీలు కొన్ని రద్దుచేసుకున్నారు కూడా.టిడిపి ఎంఎల్‌సి అరెస్టయి, పార్టీ నుంచి సస్పెండై పోయారు. సబ్రిజిస్ట్రార్లు అరెస్టయ్యారు. కాని ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం గజం భూమి కూడా పోలేదు,ఒక్క రూపాయి నష్టం రాలేదు గనక సిబిఐ విచారణ అవసరమే లేదని తేల్చిపారేసింది.పైపైన కదిలిస్తేనే ఇన్ని బయిటకు వచ్చాయి కదా లోతుగా పరిశోధిస్తే మరెన్ని వెల్లడౌతాయోనని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వాధినేతలు మాత్రం అదేం లేదనితామే తీర్పునిచ్చేస్తున్నారు. ఇద్దరు సిఎంలు ఒక్కటే విధంగా మాట్లాడ్డం అదనపు అకర్షణ