వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏడాది ముందే ఉంటాయన్న సంకేతాలను సీఎం చంద్రబాబు ఆ మధ్య ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే పార్టీ కొన్ని కీలక నిర్ణయాలపై ఇప్పట్నుంచే దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం… ముఖ్యమంత్రి కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ను ఏ నియోజక వర్గం నుంచీ ఎమ్మెల్యేగా పోటీకి దించాలనేదానిపై సీఎం ఓ క్లారిటీకి వచ్చినట్టు టీడీపీ వర్గాల నుంచీ తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ ఎమ్మెల్సీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. కానీ, ఇన్నాళ్లూ ఏ నియోజక వర్గం నుంచీ అనేది మాత్రం క్లారిటీ లేదు. లోకేష్ గెలుపు నల్లేరుపై నడకలా సాగే సెగ్మెంట్ నే చంద్రబాబు ఏరికోరి పట్టుకున్నారని అంటున్నారు! కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోకవర్గం నుంచీ చినబాబును బరిలోకి దించే అవకాశం ఉందట. ఎన్నికల్లోపు నియోజక వర్గాల పునర్విభజన జరిగితే మారొచ్చేమోగానీ, లేదంటే అదే నియోజక వర్గం నుంచి లోకేష్ ను పోటీ పెట్టేందుకు చంద్రబాబు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అదే సేఫ్ సీటు అని ఆయన భావిస్తున్నారట.
ఇక, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వియ్యంకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కూడా వేరే చోటి నుంచీ పోటీకిలోకి దింపబోతున్నారని అంటున్నారు! ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి ఆయన్ని మార్చాలనే అనుకుంటున్నారట! బాలయ్యను గుడివాడ నుంచి పోటీకి దింపే అవకాశం ఉందని తెలుస్తోంది. హిందూపురం నుంచి ఎందుకు మార్చుతున్నారంటే… అక్కడ రాజకీయ పరిస్థితులు రానురానూ టీడీపీకి ప్రతికూలంగా మారుతున్నాయనే అంచనాలున్నట్టు సమాచారం! స్థానికంగా బాలయ్యపై నెగెటివ్ వేవ్ మొదలైందనే విశ్లేషణలో చంద్రబాబు ఉన్నారట. పైగా, కృష్ణా జిల్లాకి బాలయ్యను తీసుకురావడం ఉభయ తారకంగా ఉంటుందని భావిస్తున్నారు. గుడివాడ ప్రాంతంలో కొడాలి నాని నుంచీ ఎదురౌతున్న తలనొప్పులకు కూడా చెక్ పెట్టినట్టు ఉంటుందని అనుకుంటున్నారట!
మొత్తానికి, మామా అల్లుళ్లు ఇద్దరూ ఒకే జిల్లా నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ అధికార పార్టీ వర్గాల్లో ఓ ప్రచారం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరూ గెలుపూ పార్టీకి అవసరం. సో.. ఇద్దరికీ సేఫ్ సెగ్మెంట్స్ కావాలి. కాబట్టి, కృష్ణా జిల్లాను ఎంపిక చేస్తున్నట్టు చెబుతున్నారు. నిజానికి, లోకేష్ ను ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవి ఇవ్వడంపై ఇప్పటికే చాలా విమర్శలు ఉన్నాయి. దొడ్డిదారిలో తన కుమారుడుని రాజకీయాల్లోకి తెచ్చారంటూ సీఎంపై విపక్షాలు చాలా కామెంట్స్ చేశాయి. కాబట్టి, వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తవకపోయినా కూడా.. లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన పరిస్థితి. ఇక, ముఖ్యమంత్రి వియ్యంకుడు బాలయ్యను గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుకి ఉంటుంది కదా! ఎందుకంటే, ఎన్టీఆర్ ఫ్యామిలీకి టీడీపీలో ప్రాధాన్యత తగ్గించేశారనే విమర్శలు ఇప్పటికే చాలా ఉన్నాయి. సో.. ఇద్దరికీ సేఫ్ జోన్ కృష్ణా జిల్లా అన్నమాట.