ఏ ఇంటి ముందు ఆ పాట పాడాలంటారు! రాజకీయ నాయకులు చేస్తున్నది అదే. అయితే.. ఈ క్రమంలో సొంత అస్థిత్వాన్ని కూడా కోల్పోవాల్సిన పనిలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక రేంజిలో పొగడ్తలతో ముంచడం అనేది కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకి ఆవకాయతో అబ్బిన విద్య. అంతవరకూ ఓకే, కానీ, తెల్లారితే చాలు తెలుగువాడి, వేడీ, దమ్ము, గడ్డ, ఖ్యాతి, భాష… ఇలా లెక్చర్లు దంచేసే వెంకయ్య గారు, హిందీ భాష గురించి మాట్లాడుతూ మరీ చాగిలపడిపోయారు! దేశమంటే హిందీ.. హిందీ అంటే దేశం అనే రేంజిలో మాట్లాడేశారు. హమారీ మాతృ భాషా హై హిందీ అనేశారు. హమే ఇస్పే గర్వ్ కర్నా చాహియే అంటూ గర్వపడిపోయారు!
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెంకయ్య వెళ్లారు. అక్కడ మాట్లాడుతూ… హిందీ మన జాతీయ భాష అనీ, దీన్ని అందరూ కచ్చితంగా నేర్చుకోవాలని చెప్పారు. మనదేశం ఎదగాలంటే అందరూ హిందీ నేర్చుకోవాల్సిందే అని ఉద్బోధించారు. కానీ, ఈ జనరేషన్ అంతా ఇంగ్లిష్ వైపు పరుగులు తీస్తున్నారనీ, ఇప్పటి పిల్లలు హిందీనిగానీ ఇతర ప్రాంతీయ భాషల్నిగానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ఎక్కువ శాతం ప్రజలు మాట్లాడేది హిందీ మాత్రమేననీ, కానీ కొంతమందికి హిందీ అంటే చిన్నచూపు ఉందని వెంకయ్య చెప్పారు. పార్లమెంటులో కూడా సభ్యులు హిందీలోనే మాట్లాడాలనే ప్యానెల్ విధించిన రూల్ ను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇంతకీ, హిందీపై ఇలా మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడేముందీ అంటే… దేశంలో కొన్ని చోట్ల హిందీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమౌతున్నాయి కదా! ఇటీవలే బెంగళూరులో మెట్రో సైన్ బోర్డుల్లో హిందీ భాషను పెట్టడాన్ని అక్కడ చాలామంది వ్యతిరేకించారు. ఇక, తమిళనాడులో అయితే హిందీ ఎవ్వరూ మాట్లాడరు! ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వెంకయ్య ఇలా మాట్లాడారు.
ఇంతకీ.. హిందీని దేశానికి మాతృభాష ఎప్పుడు చేశారో అర్థం కావడం లేదు! ఏ అర్థరాత్రో అపరాత్రో దేశం నిద్రపోతున్న వేళలో భాజపా సర్కారు హిందీని అధికార భాషగా మార్చేసిందేమో మరి! దేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడుతున్నారని వెంకయ్య వాస్తవాల్ని విస్మరిస్తే ఎలా..? మరాఠీ, గుజరాతీ, బిహారీ, పంజాబీ, రాజస్థానీ, ఒడియా లాంటి భాషల్ని మినహాయిస్తే దేశంలో హిందీ మాట్లాడేవారు ఎంతమంది ఉంటారు? ఉత్తర భారతం అంతా హిందీ మాట్లాడతారు అని వెంకయ్య ఏ లెక్కన చెప్తారు? కరెక్ట్ గా లెక్కలు తీస్తే దేశంలోని అత్యధికులు మాట్లాడేది తెలుగు, తమిళ భాషలు ఉంటాయి. దక్షిణాదిపై హిందీని మరోసారి రుద్దే ప్రయత్నానికి వెంకయ్య వకాల్తా పుచ్చుకున్నట్టుంది. పవన్ కల్యాణ్ భాషలో చెప్పాలంటే… ఉత్తరాది ఆధిపత్యానికి వెంకయ్య మోకరిల్లి, మోడీని ప్రసన్నం చేసుకునే ప్రయాసలో భాగంగానే ఇలా ప్రసంగించారని అనుకోవాలి.