ఆస్ట్రేలియా నుంచి మలేసియా వెడుతున్న ఎయిర్ ఏసియా విమానం తృటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. విమానం ఇంజిన్ ఫెయిలవ్వడంతో ఒకే ఇంజిన్‌తో గంటన్నర సేపు ప్రయాణించింది. ఒక డొక్కు బస్సులా శబ్దం చేస్తూ, వాషింగ్ మెషిన్లా ఊగుతూ సాగించిన ఆ ప్రయాణం ప్రయాణికుల పైప్రాణాలు పైనే పోయేలా చేసింది. ఇంజిన్ విఫలమైన అంశాన్ని పైలట్ ప్రకటిస్తూ.. దైవ ప్రార్థన చేయాల్సిందిగా ప్రయాణికులకు సూచించారు. వెంటనే ప్రయాణికులు హడలెత్తిపోయారు. భూమికి వేల అడుగుల ఎత్తున చివురుటాకులా ఎగురుతున్న విమానం.. పెద్ద పెద్ద శబ్దాలు. చేసేదేమీ లేక ప్రయాణికులు ఎవరి దారిని వారు వారి కులదైవాల్ని ప్రార్థించుకున్నారు. దేవుడంటే నమ్మకం లేని వారు సైతం మనస్సులోనైనా దణ్ణం పెట్టుకుని ఉంటారు. పెర్త్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరిన ఈ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడ్డంతో వెనక్కి రప్పించారు. ఏ 330 ఎయిర్‌బస్ డగడగలాడుకుంటూ వెనుతిరిగింది. అక్కడి నుంచి విమానమంతా భగవన్నామస్మరణతో నిండిపోయింది. ఏ 330కి ఇది ఈ నెల రెండో ప్రమాదమట. అదృష్టవశాత్తూ రెండు ప్రమాదాలలోనూ ఎవరూ గాయపడకుండా తప్పించుకోవడం విశేషం.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి