ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ… ఈ మాట వినగానే అలాంటిది ఒకటుందా అనే అనుమానం కూడా కలుగుతుంది. రాష్ట్ర విభజన తరువాత ఆ స్థాయిలో చావుదెబ్బ తగిలింది. అయితే, అప్పట్నుంచీ కోలుకోవడం కోసం నానా రకాలుగా పాకులాడుతున్నా… ఏపీ కాంగ్రెస్ నేతలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ఇప్పుడు ఇదే అంశాలపై హైకమాండ్ దృష్టి సారించింది. ఏపీలో కాంగ్రెస్ కోలుకోవడం కోసం, కోల్పోయిన ఓటు బ్యాంకును ఒడిసి పట్టుకోవడం కోసం కొత్త వ్యూహాలను అధిష్ఠానం సిద్ధం చేసింది. ఏపీ నేతల్ని హుటాహుటిన ఢిల్లీకి పిలిచి, రాబోయే రోజుల్లో రాష్ట్ర నేతలు అనుసరించాల్సి వ్యూహాల్ని పార్టీ పెద్దలు వివరించారు. ఆ వ్యూహం ఏంటంటే.. ఎటాక్ జగన్..!
తన అస్థిత్వాన్ని తిరిగి పొందడం కోసం ఏపీ కాంగ్రెస్ నేతలు శక్తివంచన లేకుండా కృషి చేస్తూనే ఉన్నా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విధానాలపై కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పిస్తోంది. ప్రత్యేక హోదాపై ఆ పార్టీ కూడా పోరాటం చేస్తూనే ఉంది! తాజాగా విశాఖ భూ కుంభకోణం ఆరోపణలపై కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉద్యమించారు. అయితే, ఇన్ని చేస్తున్నా ఎక్కడా ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ హై కమాండ్ చేసిన సూచన ఏంటంటే… ఏపీ నేతలు విమర్శించాల్సిందీ, టార్గెట్ చేయాల్సింది చంద్రబాబు కాదనీ, విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం!
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిల పడటానికి కారణం వైకాపా అనీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా ఆ పార్టీవైపు టర్న్ కావడంతోనే కాంగ్రెస్ కి దెబ్బ పడిందని లెక్కలతో సహా హైకమాండ్ విశ్లేషించినట్టు సమాచారం. కాబట్టి, కాంగ్రెస్ ఓటు బ్యాంకును తిరిగి రప్పించుకోవాలంటే ముందుగా విపక్ష నేత జగన్ పై విమర్శలు పెంచాలని రాష్ట్ర నేతలకు సూచించినట్టు చెబుతున్నారు. అంతేకాదు, గతంలో వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలు, ప్రారంభించిన ప్రాజెక్టులూ స్కీములూ అన్నీ జగన్ ఖాతాలో పడకుండా చూడాలనీ… అవన్నీ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలుగా ప్రజలకు చెప్పాలనీ… వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఉండటం వల్లనే రాష్ట్రానికి అప్పట్లో ఆ రేంజిలో ప్రయోజనాలు చేకూరాయనే ప్రచారం చేయాలని రాష్ట్ర నేతలకు హై కమాండ్ సూచించింది.
సో.. ఇకపై ఆంధ్రాలో కాంగ్రెస్ నేతల ఫ్రెష్ టార్గెట్ జగన్ అన్నమాట. జగన్ పై ఉన్న అవినీతి ఆరోపణలపైనా, ఇతర అంశాలపైనా కాంగ్రెస్ విమర్శలకు దిగుతుందన్నమాట. విమర్శల విషయంలో జగన్ కే మొదటి ప్రాధాన్యత ఇచ్చి, ఆ తరువాత చంద్రబాబు సర్కారుని టార్గెట్ చేసుకోవాలని హైకమాండ్ మాస్టర్ ప్లాన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలు ఆశిస్తున్నట్టుగా వైకాపాకి షిప్ట్ అయిన ఏపీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు, తిరిగి వారివైపునకు ఎలా మళ్లించుకుంటారో.. ఈ ప్రయత్నం ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.