నంద్యాల ఉప ఎన్నికలో అభ్యర్థిని ప్రతిపక్ష పార్టీ వైకాపా అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి పేరు ఖరారైంది. పార్టీ తరఫున ఆయన్ని ఎంపిక చేస్తున్నట్టు పార్టీ అధిష్ఠానం లాంఛనంగా ప్రకటించింది. వైకాపాకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులతో చర్చల అనంతరం ఆయన పేరును అధ్యక్షుడు జగన్ ఖరారు చేశారు. పార్టీ సమన్వయకర్తగానూ, ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థిగానూ శిల్పా పేరును ఫైనలైజ్ చేశారు.
నిజానికి, శిల్పా తెలుగుదేశం పార్టీని వీడటంతోనే వైకాపా తరఫున అభ్యర్థి ఆయనే బరిలోకి దిగుతారనేది దాదాపు కన్ఫర్మ్ అయింది. కానీ, ఏమీ ఆశించకుండా వైకాపాలోకి వచ్చాననీ, టీడీపీలో గుర్తింపు లేకపోవడమే పార్టీ వీడటానికి కారణమనీ, జగన్ నుంచి ఎలాంటి ఆఫర్లూ తనకు రాలేదని శిల్పా చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు ఆయనే అభ్యర్థిగా బరిలోకి వచ్చారు. అయితే, నంద్యాల ఉప ఎన్నికలో అసలైన సవాళ్ల పర్వం ఇక్కడి నుంచే మొదలు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే, నంద్యాలపై వైకాపాలోనే చాలామంది చాలా హోప్స్ పెట్టుకుంటూ వచ్చారు కదా! వైకాపాకి చెందిన భూమా నాగిరెడ్డి టీడీపీలోకి చేరిన వెంటనే నంద్యాల పార్టీ బాధ్యతల్ని రాజగోపాల్ రెడ్డికి జగన్ అప్పగించారు. భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే తనకే సీటు ఇస్తానంటూ జగన్ మాటిచ్చారని కూడా ఈ మధ్యనే రాజగోపాల్ అభిప్రాయపడ్డారు కూడా! సో… శిల్పాకి టిక్కెట్ ఖాయం కావడంతో ఆ వర్గం గుర్రుగా ఉందని తెలుస్తోంది. ఇదొక్కటే కాదు.. నంద్యాల వైకాపాలో మరో వర్గపోరు కూడా ఈ తరుణంలో తెరమీదికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
గంగుల ప్రభాకర్ రెడ్డి వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. ఈయన సోదరుడు గంగుల ప్రతాప్ రెడ్డి కూడా పార్టీలోకి వస్తారంటూ భారీగానే ప్రచారం జరిగింది. రెండు నెలల కిందట ఆయన జగన్ ను కలిసి, చేరిక విషయమై చర్చించినట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే, ఆ తరువాత న్యూజిలాండ్ టూర్ కి జగన్ వెళ్లారు. ఆయన తిరిగి రాగానే ప్రతాప్ రెడ్డి పార్టీలో చేరతారన్నారు. కానీ, విదేశీ పర్యటన నుంచి జగన్ తిరిగి వచ్చిన వెంటనే ఇక్కడ సీన్ మారిపోయింది. శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ నుంచి బయటకి రావడం.. వైకాపా తీర్థం పుచ్చుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు శిల్పా అభ్యర్థిత్వ ఎంపికపై కూడా గంగుల వర్గం అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
నిన్న మొన్నటి వరకూ వైకాపా అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ కొనసాగడంతో ఈ వర్గాల నుంచి అసంతృప్తులేవీ బయటి రాలేదు. కానీ, ఇప్పుడీ ప్రకటన తరువాత రాజగోపాల్ రెడ్డి, గంగుల వర్గాల నుంచి అసంతృప్తి గళం వినిపించే ఛాన్సులు ఉన్నాయనే అంటున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే.. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైకాపాలో మూడు గ్రూపులు కనిపిస్తున్నాయి. మిగతా రెండు గ్రూపుల అసంతృప్తులను అరికట్టి, శిల్పా గెలుపునకు కృషి చేసేలా వారిని ఒకతాటి మీదికి తీసుకురావడం జగన్ ముందున్న సవాలే అని చెప్పాలి.