ముద్రగడ పద్మనాభంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి సవాలు తప్పేలా కనిపించడం లేదు. వచ్చే నెల 26నుంచి చేపట్ట తలపెట్టిన నిరవధిక పాదయాత్ర రూట్ మ్యాప్‌ను ఆయన సోమవారం విడుదల చేశారు. ఎవరడ్డొచ్చినా యాత్ర ఆగదని ముద్రగడ పద్మనాభం ప్రకటించడం ఆయన ఘర్షణాత్మక వైఖరిని వెల్లడించింది. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ 2014 నుంచి ఇంత వరకూ రెండుసార్లు నిరవధిక దీక్షలకు దిగారు. ఒక సారి కోనసీమకు పాదయాత్ర తలపెట్టారు. ఇది సాగకుండా ప్రభుత్వం ఆయన్ను అడ్డుకుంది. పాదయాత్రకు అనుమతి లేదని చెప్పడంతో ముద్రగడ ఇంటిలోకి తిరిగి వెళ్ళిపోయారు. అనుమతిచ్చినప్పుడే పాదయాత్ర చేపడతానని చెప్పిన ఆయన మళ్ళీ అందుకు తలపెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రూట్ మ్యాప్ విడుదల సందర్భంగా ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు ఆయన పట్టుదలను సూచిస్తున్నాయి. కాపు రిజర్వేషన్లను ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలో పెట్టేసిందని ఆయన విమర్శించారు. ఐవైఆర్ కృష్ణారావు ఉదంతంలో ప్రభుత్వానిదే తప్పని అనడం వెనుక ఆయన వ్యూహం కనిపిస్తోంది. గతంలోనూ మాజీ ఎంపీ హర్షకుమార్ మద్దతు కోరిన ముద్రగడ ఈ వ్యాఖ్యతో బ్రాహ్మణులను తనవైపు తిప్పుకుని, బలం పెంచుకోవాలని చూస్తున్నారేమోననిపిస్తుంది. అక్కడితో ఆగకుండా 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ఓట్లేయవద్దని పిలుపివ్వడం కూడా దీనికి బలం చేకూరుస్తోంది. ప్రస్తుత రాజకీయాల్లో అంతా ఆధిపత్య ధోరణే కనిపిస్తోంది. దీన్ని ముద్రగడ అందిపుచ్చుకున్నట్లే కనిపిస్తోంది. ఈసారి చంద్రబాబు ఆయన్ను ఎలా కట్టడి చేస్తారనేది చూడాల్సి ఉంది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి