ప్రజారోగ్యశాఖ చీఫ్ ఇంజనీర్ పాము పాండురంగారావు దగ్గర పట్టుపడిన ఆస్తులు సంపదపై వస్తున్న సమాచారం సమాజాన్ని హడలెత్తిస్తున్నది. 800 కోట్లకు అక్రమాదాయం కూడగట్టడం మామూలు విషయం కాదు. ఆయన అవినీతి వ్యవహారాలు నిజమే అయినా శాఖ పరిధిలోనే ఇదంతా జరగలేదని తెలిసిన వారు తేల్చిచెబుతున్నారు. ఆయన ఒక బడా మంత్రికి బినామిగా వుండి చాలా పనులు చేస్తూ వచ్చారట. ఆ పెద్దాయన సొమ్ములు కూడా వీటిలో కలసివున్నాయన్నది జనవాక్యం. ఆయన అండవుంది గనక ఇతర అక్రమాలు కూడా యథేచ్చగా నడిచిపోయాయి. కాబట్టి ఆ తెరవెనక బడాబాబులను కూడా బయిటకు లాగితే తప్ప అసలు మొత్తం రాదంటున్నారు. ఉత్తరాంధ్రలో భూ కబ్బాలు అవినీతి భాగోతాలు ఆయన ఆశీస్సులు లేకుండా జరిగే ప్రసక్తి లేదని ప్రభుత్వానికీ తెలుసు. అన్నీ తెలిసినా బినామి ముచ్చటలోకి పోకుండా పాము పురాణాలతోనే సరిపెట్టి కొండ చిలువను కాపాడుతున్నారని ఎపి ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. పైగా ఇలాటి వారు మరెందరు బినామిలుగా ఉపయోగపడుతున్నారో కూడా తేల్చాలని ప్రతిపక్ష నేతలు గట్టిగా కోరుతున్నారు. షరా మామూలుగా ప్రభుత్వం మాత్రం ఇది ఎసిబికే పరిమితం చేస్తున్నది.