గడిచిన రెండు వారాలలో 15మంది గిరిజనుల మృతి… కారణం ఆహారం విషతుల్యం కావడం… ఈ వార్తే నిజమైతే.. రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలొంచుకోవాలి. ప్రభుత్వాధినేతలకు కోపం రావచ్చు గాక. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వైరామవరం మండలం..చాపరాయి.. ఓ కుగ్రామం. గుర్తుతెలియని అనారోగ్యం ఆ గ్రామాన్ని రెండు వారాల క్రితం చుట్టుముట్టింది. వాంతులు, విరేచనాలతో 15మంది మరణించారని డెక్కన్ క్రానికల్ ఓ వార్తను ప్రచురించింది. తాజాగా రెండురోజుల్లో 24మంది రాజమహేంద్రవరం, కాకినాడ, తదితర పట్టణాలలో చికిత్సకు చేరారనీ, వారి పరిస్థితి విషమంగా ఉందనీ కూడా ఆ వార్త తెలుపుతోంది. మారేడుమిల్లిలో మే 29న జరిగిన ఓ వివాహ వేడుకలో వీరంతా విష తుల్యమైన ఆహారాన్ని తిన్నారని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎఎన్ దినేశ్‌కుమార్ చెబుతున్నారు. కొద్ది రోజుల అనంతరం వారు అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి వరుసగా 15మంది కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా వివరాలను తెలుసుకున్నారు. వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గత రాత్రి ఆ గ్రామాన్ని సందర్శించారు. తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైద్య బృందాలు ఆ గ్రామానికి తరలి వెళ్ళాయి. అంతా బాగానే ఉంది. ఒకే రోజు రెండు మరణాలు సంభవిస్తేనే అనుమానాలు వ్యక్తం చేస్తాం. కనీసం మూడు.. కాదు ఐదు మరణాలకైన ఆ ప్రాంతంలోని హెల్త్ వర్కర్లకి అనుమానం రావాలి కదా. తగిన చర్యలు తీసుకోవడమో.. అధికారులకు తెలియజేయడమో.. చేయాలి కదా. 15మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాక అనుమానం రావడాన్ని ఏమనాలి. నిర్లక్ష్యమనాలా. నిర్లక్ష్యానికి 15మంది కన్నుమూస్తే బాధ్యత ఎవరికీ ఉండదా. ఈ చావులతో.. చాపరాయి గ్రామం ఇప్పుడు చావురాయిగా మారిపోయింది. ఏ ఇల్లు చూసినా విషాదం.. గోలుగోలున కన్నీళ్ళు పెట్టుకుంటున్న ప్రజలు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి