తెలుగు రాష్ట్రాలు సోదరుల్లా విడిపోయాయి, అలానే కలిసికట్టుగా పనిచేసుకోవాలని అనేది ఆంధ్రా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష! అయితే, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లు ఇద్దరూ భిన్న ధ్రువాలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వీరిద్దరూ కలిసి పనిచేసిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా అని దూర్భిణి వేసి గాలించినా కనిపించవు లెండి! తెరాస రాజకీయ ప్రయోజనాలు వేరు, టీడీపీ పొలిటికల్ మైలేజ్ వేరు! ఒకవేళ ఈ ఇద్దరు చంద్రులూ ఒకే అంశంపై కలిసికట్టుగా స్పందించినట్టు కనిపించినా… లోలోపల ఎవరి అజెండాలు వారికి ఉంటాయి. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అలాంటి విడివిడి కలిసికట్టు తనమే కనిపిస్తోంది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో ఇద్దరు చంద్రులూ కామన్ గా ఒకే అంశమై కేంద్రాన్ని కోరారు! రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తున్న సందర్భంలో… తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓ కీలక అంశంపై కేంద్రం పాజిటివ్ గా స్పందించేలా, త్వరగా చర్యలు తీసుకునేలా ఇద్దరూ ప్రయత్నించినట్టు కథనం! ఇంతకీ.. కేసీఆర్, బాబులను కలిపిన ఆ ఉమ్మడి ప్రయోజనాంశం ఏంటంటే… నియోజక వర్గాల పునర్విభజన!
రాబోయే వర్షాకాల సమావేశంలో నియోజక వర్గాల పునర్విభజన బిల్లు వచ్చేలా ఈ ఇద్దరూ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందనీ, ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే ఎన్నికలు దగ్గర పడిపోతాయనీ, నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ సాధ్యం కాదనే ఉద్దేశంలో ఇద్దరు చంద్రులూ ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే సందర్భంలో ఇద్దరూ దీని గురించే కాసేపు చర్చించుకున్నారట! ఈ ఇష్యూ ప్రధానమంత్రి కార్యాలయంలోనే పెండింగ్ ఉందనీ, న్యాయశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిందనీ, కాబట్టి ఇకపై ప్రధాని నరేంద్ర మోడీపై ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయినట్టు కథనాలు వచ్చాయి.
అంటే, తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుదారులకు సీట్లు కేటాయించడం అనే అంశంపై ముఖ్యమంత్రులు ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారన్నమాట! ఫిరాయింపుదారులకు స్థానాలు కేటాయించాల్సిన చారిత్రక అవసరం తెరాస, టీడీపీలకి ఉంది కదా! మిగతా విషయాల్లో ఈ ఇద్దరూ కలవకపోయినా… నియోజక వర్గాల పునర్విభజనలో గతంలో లేని కలిసికట్టుతనం ప్రదర్శిస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే చిత్తశుద్ధి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రదర్శించి, కేంద్రంతో ప్రయత్నించి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి! ఇప్పుడు ఫిరాయింపుదారులకు సీట్లు కేటాయించడం అనేదే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కోబోతున్న ప్రధాన సమస్యగా కేంద్రం దగ్గర చేతులు నులిమేసుకుంటున్నారు.
కొసమెరుపు ఏంటంటే… ప్రతిపక్ష నేత జగన్ కూడా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే, ఈ మద్దతు వెనక ఉన్న డీల్ ఏంటంటే… ఆంధ్రప్రదేశ్ లో నియోజక వర్గాల పునర్విభజనను వాయిదా వేయాలని ప్రధానిని కోరారట! ఆ షరతు మేరకే రాష్ట్రపతి అభ్యర్థికి జగన్ మద్దతు ఇచ్చారని కూడా కథనాలు వినిపిస్తూ ఉండటం విశేషం!ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు, ఏపీ ప్రతిపక్ష నేత కూడా కలిసికట్టుగానే ప్రయత్నిస్తున్నారన్నమాట! కాకపోతే.. ఈయన యాంగిల్ వేరు. వీరిలో ఉన్న కామన్ యాంగిల్.. రాజకీయ ప్రయోజనాలే అనేది అర్థమౌతూనే ఉంది కదా!