రాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియకు వైకాపాకి ఆహ్వానం అందింది! అవును, రామనాథ్ కోవింద్ నాలుగో సెట్ నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా భాజపా నుంచి ఏపీ ప్రతిపక్ష పార్టీకి ఆహ్వానం అందడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది. ఎన్డీయే అభ్యర్థిగా కోవింద్ ను భాజపా ప్రకటించడం.. ఆయనకి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ మద్దతు పలకడం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబుతో రెండో సెట్ నామినేషన్ పై సంతకం తీసుకున్నారు. ఇదే తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా సాదరంగా ఆహ్వానించారు. ఇప్పుడు నాలుగో సెట్ నామినేషన్ వేసే కార్యక్రమానికి రావాలంటూ వైకాపా పార్లమెంటు సభ్యులకు ఆహ్వానం అందడం విశేషం!
నిజానికి, ఆంధ్రాలో భాజపా, టీడీపీలు భాగస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. టెక్నికల్ గా ఆంధ్రాలో భాజపాకి కూడా వైకాపా ప్రతిపక్ష పార్టీ అవుతుంది. అలాంటప్పుడు వైకాపాని ఎలా ఆహ్వానిస్తారనే చర్చ టీడీపీ వర్గాల్లో మొదలైనట్టు సమాచారం. భాజపా చర్య దేనికి సంకేతం అనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ మధ్యనే జగన్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్ పేరు ప్రతిపాదించగానే.. విజయ్ సాయి రెడ్డి ఆయన్ని కలుసుకుని మద్దతు తెలపడం చర్చనీయమైంది. అంటే, కోవింద్ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని ముందుగానే జగన్ తెలుసా అనే అభిప్రాయాలూ వినిపించాయి. ఇక, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు విషయమై భాజపాలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవసరమైతే తాము వైకాపాతో కూడా దోస్తీ కడతాం అనే సంకేతాలు ఇవ్వడమే భాజపా ఆహ్వానానికి అర్థమా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమౌతున్నాయి.
టీడీపీతో భాజపా దోస్తీపై ఈ మధ్యనే కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. రాష్ట్రంలో భాజపా సోలోగా ఎదగాలంటే టీడీపీతో పొత్తు వదులుకోవాలన్న అభిప్రాయం కొంతమంది ఏపీ కమలనాథుల్లో ఉంది. ఎప్పటికప్పుడు చంద్రబాబును వెనకేసుకొచ్చే ధోరణిని తగ్గించుకోవాలంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకి కూడా భాజపా అధినాయకత్వం సూచించినట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే, ఇదే తరుణంలో.. టీడీపీపై తొందరపడి ఎలాంటి విమర్శలూ చెయ్యొద్దని కూడా ఈ మధ్యనే ఢిల్లీ పెద్దలు రాష్ట్ర భాజపా నేతలకు సూచించారు. అలాంటప్పుడు వైకాపాకు భాజపా ప్రాధాన్యత ఎందుకు పెంచుతున్నట్టు..?
ఇంకోపక్క.. భాజపాతో పొత్తు కోసం వైకాపా కూడా ఈ మధ్య ఉవ్విళ్లూరుతున్నట్టుగానే కనిపిస్తోంది కదా! కేవలం కేసుల్ని పరిష్కరించుకునేందుకే మోడీని జగన్ కలుసుకున్నారంటూ ఇప్పటికే టీడీపీ చాలాసార్లు విమర్శించింది. అంతేకాదు.. ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న జగన్ కి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడమేంటని కూడా కొంతమంది టీడీపీ నేతలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైకాపాకి ఆహ్వానం పలుకుతూ… తెలుగుదేశం పార్టీకి ఏవో సంకేతాలు ఇవ్వాలని భాజపా ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. మొత్తానికి, భాజపా ఆహ్వానంతో ఏపీ పాలిటిక్స్ లో భాజపా తీరు హాట్ టాపిక్ గా మారింది.