కృష్ణవంశీ… హిట్లు ఉన్నా, లేకున్నా ఆయన పక్కన మాత్రం క్రియేటీవ్ డైరెక్టర్ అనే బిరుదు ఎంచక్కా చేరిపోయి ఉంటుంది. కమర్షియల్ పడికట్టు సూత్రాలకు ఆయన ఏమాత్రం విలువ ఇవ్వడని, అనుకొన్నదే తీస్తాడని పేరుంది. ఆయన చేతిలో పడితే.. స్టార్స్ కూడా నటులుగా బయటకు వస్తారని కితాబులు ఇస్తుంటారు. అయితే… ఇటీవల నృత్య దర్శకుడు రాకేష్ మాస్టర్ – కృష్ణవంశీపై నిప్పులు చెరిగాడు. టెక్నీషియన్స్‌కి గౌరవం ఇవ్వడం చేతకాదని, కృష్ణవంశీ క్రియేటీవ్ డైరెక్టర్ కాదని, తనో బచ్చా డైరెక్టర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.
రాకేష్ ఆవేదనకు అర్థం ఉంది. ఎందుకంటే.. చక్రం సినిమాలో `జగమంత కుటుంబం` అనే పాటను కంపోజ్ చేశాడు రాకేష్ మాస్టర్. అయితే.. సెట్లో అంతా కృష్ణవంశీనే చూసుకొన్నాడని, తన ఆలోచనలకు అస్సలు విలువ ఇవ్వలేదని, కనీసం ఆ పాటకు గానూ పారితోషికం కూడా ఇవ్వలేదని, టెక్నీషియన్ల ఉసురు పోసుకొంటే ఇలానే అవుతుందని, ఇప్పుడు కృష్ణవంశీ రోడ్డున పడ్డాడని… చాలా ఘాటుగా రెచ్చిపోయాడు. కృష్ణవంశీ దగ్గర వచ్చిన పేచీనే ఇది. కావల్సినంతమంది టెక్నీషియన్లు చుట్టూ ఉంటారు. కానీ చివరికి కృష్ణవంశీ తన మాటే నెగ్గించుకొంటాడు. డైలాగు రైటర్లు, కంపోజర్లు, ఫైట్ మాస్టర్లు, డాన్స్ మాస్టర్లు ఎవరైనా సరే.. కృష్ణవంశీ చెప్పు చేతల్లో నడవాల్సిందే. డైలాగ్ రైటర్ రాసిచ్చిన పేపర్ని అడ్డంగా కొట్టేసి వెనుక తనకు కావల్సినట్టు డైలాగులు రాసుకొనే తత్వం కృష్ణవంశీది. దీన్ని కృష్ణవంశీ ‘నా క్రియేటివిటి’ అనుకొంటాడు. కానీ అక్కడే సదరు టెక్నీషియన్ ఈగో దెబ్బతింటుంది. ఈమాత్రం దానికి మమ్మల్ని పెట్టుకోవడం ఎందుకు..?? అనేది టెక్నీషియన్ల మాట. అదీ నిజమే మరి
గోవిందుడు అందరి వాడేలే సినిమా కోసం బుర్రా సాయిమాధవ్‌ని రైటర్‌గా తీసుకొన్నారు. సాయి డైలాగులు రాసిస్తే.. దాన్ని అడ్డంగా కొట్టేసి – తనకు నచ్చిన డైలాగుల్ని అక్కడక్కడ రాసుకొని వాటినే నటీనటుల చేత చెప్పించాడు కృష్ణవంశీ. ఆఖరికి రైటర్‌గా బుర్రా పేరు కూడా స్క్రీన్ పై పడలేదు. ఈ మాత్రం దానికి రైటర్లను తీసుకోవడం ఎందుకు? వాళ్లని అగౌరవ పరచడం ఎందుకు?? కృష్ణవంశీ తొలి సినిమా నుంచీ.. పక్కనే తిరిగిన ఉత్తేజ్ – ఇది భరించలేకే బయటకు వచ్చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. రైటింగ్ సైడ్ అంటే ఓకే అనుకోవొచ్చు. కృష్ణవంశీలోనూ ఓ రైటర్ ఉన్నాడు కదా అని సర్దుకుపోవొచ్చు. డాన్స్ డైరెక్టర్ల విషయంలో , వాళ్ల పనిలో జోక్యం చేసుకోవడం ఎందుకు మరి?? వీళ్లందరినీ పక్కకు తోసేసి కథ, కథనం, మాటలు, పాటలు, డాన్స్, పోరాటాలు, దర్శకత్వం: కృష్ణవంశీ అని చాంతాడంత టైటిల్ కార్డ్ వేసేసుకోవొచ్చు కదా?? ఏంటో ఎవరి చాదస్తం వాళ్లది. ఎవరి క్రియేటివిటీ వాళ్లది. కృష్ణవంశీ క్రియేటివిటీ ఇంతేనని రాజేష్ లాంటి వాళ్లు సర్దుకొని పనిచేయాలి.. లేదంటే అన్నీ`సర్దుకొని` ఉత్తేజ్లా బయటకు వచ్చేయాలి. అంతకంటే చేసేదేముంది??