తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు మంత్రి కెటిఆర్‌కు ఏదో విధంగా వారసత్వం అప్పగించేందుకు ఆతృతి పడుతున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వుండింది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒకటికి రెండు సార్లు మంత్రి హరీష్‌రావుతో విధేయతా వ్యాఖ్యలు చేయించడం కూడా ఆ అభిప్రాయాన్ని పెంచింది. అయితే కారణం ఏమిటో గాని ఇప్పుడా పరిస్థితి మారిపోయిందని అంతర్గత వర్గాల కథనం. కెసిఆర్ ప్రజాభిమానం కాపాడుకుంటూ ఆరోగ్యంగా వున్నప్పుడు ఈ నాయకత్వ మార్పు చర్చ మంచి సంకేతాలు ఇవ్వదని పార్టీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. కెటిఆర్ ఈ మాట చాలా సార్లు చెబుతున్నా అన్నీ ఆయన చుట్టూనే తిరుగుతున్నందువల్ల వూహాగానాలకు అవకాశం పెరిగింది.తండ్రీ కొడుకుల హడావుడి కూడా అందుకు కొంత వూతమిచ్చింది. ఇప్పటివరకూ వరస ఎన్నికల విజయాలు నిజమే అయినా పొంచి వున్న సవాళ్లు తక్కువ కాదని టిఆర్‌ఎస్ గుర్తించినట్టు కనిపిస్తుంది. ప్రతిపక్షాలు జెఎసి వంటి శక్తులు సర్వశక్తులూ సమీకరించుకుంటుంటే నిరర్థకమైన వారసత్వ చర్చకు అవకాశమివ్వరాదనే నిర్ణయానికి వచ్చారట. మధ్యంతర మార్పు కాదు కదా వచ్చే ఎన్నికల్లో విజయం లభించిన తర్వాత కూడా కెసిఆరే ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ ప్రజా ప్రతినిధి ఒకరు చెప్పారు. భారత రాజకీయ లెక్కల ప్రకారం కెసిఆర్ వయస్సు కూడా ఏమంత ఎక్కువ కాదని ఆయన గుర్తు చేశారు. అయితే వచ్చే ఎన్నికల తర్వాత అప్పటి పరిస్థితులు పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు గాని ఇప్పుడు కెటిఆర్ పట్టాభిషేకంపై అతిగా ఆలోచన అర్థరహితమేనని ఆ సీనియర్ నేత తేల్చి పారేశారు. హరీశ్ రావు శక్తిని కూడా మరీ తక్కువ అంచనా వేయకూడదని చెబుతూనే కెసిఆర్ నాయకుడుగా వున్నంత వరకూ హరిశ్ ఎలాటి దుస్సాహసం చేసే అపరిపక్వ వ్యక్తి కాదని కూడా స్పష్టం చేశారు.