సావిత్రి జీవిత కథని `మహానటి` పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. చిన్న సినిమాగా అనుకొన్నా.. రాను రాను ఓ భారీ సినిమాగా రూపాంతరం చెందుతూ వస్తోంది మహానటి. సావిత్రి జీవిత కథ అంటే ఆ తరం అగ్ర నటీనటుల్ని చూపించాల్సిందే. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలు తప్పని సరి. ఈ పాత్రల్లోఎవరు కనిపిస్తారన్న ప్రశ్న.. ప్రస్తుతం టాలీవుడ్‌ని ఊపేస్తోంది. ఎన్టీఆర్ గా జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే… ఈ వార్తల్లో నిజం లేదని చిత్రబృందం కొట్టి పరేసింది.
నిజానికి ఎన్టీఆర్ పాత్ర కోసం ఎన్టీఆర్ ని సంప్రదించిన మాట వాస్తవమే అని తెలిసింది. ఎన్టీఆర్‌కి కథ, తన పాత్ర గురించి మొత్తం చెప్పార్ట. కానీ.. ఎన్టీఆర్ మాత్రం ”తాతయ్యగా కనిపించే స్థాయి నాకు లేదు.. ఆ పాత్రని క్యారీ చేసేంత మెచ్యూరిటీ నాకు ఇంకా రాలేదు” అన్నాడట. ఎన్టీఆర్‌ని ఎన్నివిధాలుగా ఒప్పించడానికి ప్రయత్నించినా, ఎన్టీఆర్ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. జూనియర్‌కీ అశ్వనీదత్‌కీ మధ్య మంచి అనుబంధమే ఉంది. ఇద్దరి కాంబోలో వచ్చిన శక్తి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ సానుభూతితో అయినా.. ఎన్టీఆర్ ఈ సినిమాకి ఓకే చెబుతాడనుకొన్నారంతా. అయితే.. ఎన్టీఆర్ మాత్రం.. ‘నో’ అంటున్నాడు. అయితే చివరి వరకూ ఎన్టీఆర్ డేట్ల కోసం ఎదురుచూద్దామని, కాని పక్షంలో ప్రత్యామ్నాయం ఆలోచించాలని అశ్వనీదత్ భావిస్తున్నార్ట. మరి దత్తు ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాలి.