దేశంలో ఇప్పుడు అందరి దృష్టీ జీఎస్టీపైనే. అంతా ఇదే హడావుడి. జీఎస్టీ వస్తే ఏం జరుగుతుందనే అంశంపై ప్రజల్లో రకరకాల ఆందోళనలూ అభిప్రాయాలూ అనుమానాలు ఉన్నాయి. వస్తు సేవా పన్ను (జీఎస్టీ)కి ఒకట్రెండు రాజకీయ పార్టీలు మినహా దాదాపు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచీ జీఎస్టీ అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా సన్నాహలు చేసింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తారు. భారతదేశ చరిత్రలో ఈ పన్ను విధానాన్ని ఓ గొప్ప సంస్కరణగా భాజపా సర్కారు చెప్పుకుంటోంది. అయితే, కేంద్రం ఇంత అట్టహాసంగా జీఎస్టీ అమలుకు ఏర్పాట్లు చేస్తుంటే… సామాన్యులతోపాటు చాలా వర్గాల ప్రజల్లో కొన్ని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
గతంలో నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ తీరున అమలు చేసిందో అనేది మరచిపోలేం! సరైన సన్నద్ధత లేకుండా, తదనంతర పరిణామాలపై అంచనా, అవగాహన, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లాంటివి ఏవీ లేకుండా ఇబ్బడిముబ్బడిగా పెద్ద నోట్లను రద్దు చేశారు. గడచిన నవంబర్ లో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్యులు నానా అవస్థలూ పడ్డారు. నిజం చెప్పాలంటే ఆ ప్రభావం నుంచీ ఇప్పటికీ దేశం పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఆ నిర్ణయం ద్వారా దేశంలో నల్లధనాన్ని ఏ మేరకు కట్టడి చేశారో భాజపా సర్కారుకే తెలియదనేది వేరే చర్చ! ఇప్పుడు జీఎస్టీ విషయంలో కూడా సరైన సన్నద్ధతతో కేంద్రం ఉందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే, జీఎస్టీ అమలుపై అన్ని వర్గాల నుంచీ పరిపూర్ణ సంసిద్ధత కనిపించడం లేదు. ముఖ్యంగా వ్యాపార వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమౌతోంది. జీఎస్టీ తరువాత ఉండబోతున్న పన్ను రేట్లపై నిరసనలు వస్తున్నాయి.
జీఎస్టీ సక్రమంగా అమలు కావాలంటే ట్రేడర్లతోపాటు సామాన్య ప్రజల నుంచి కూడా పరిపూర్ణ మద్దతు కావాల్సి ఉంటుందనీ, అన్ని వర్గాల సహకారం లభించినా వ్యవస్థ అంతా ఒక పద్ధతి ప్రకారం సెట్ కావడానికి కనీసంలో కనీసం ఆర్నెలు సమయం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ తరువాత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, జీఎస్టీ అమల్లోకి వచ్చాక కొన్ని మార్పులూ చేర్పులకు కేంద్రం సిద్ధంగా ఉండాలి. ప్రజలు, వ్యాపార వర్గాల నుంచీ వివిధ పన్నులపై నిరసన వ్యక్తమయ్యే ఛాన్సులైతే ఉన్నాయి. ఫీడ్ బ్యాక్ ఆధారంగా పన్నుల విధానంలో మార్పులకు జీఎస్టీ కౌన్సిల్ రెడీగా ఉండాలి. ఇంకోటీ… ఇప్పటికే జీఎస్టీపై ప్రజల్లో కొంత గందరగోళం ఉంది. వారికి అర్థమయ్యే రీతిలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని కేంద్రం సంసిద్ధంగా ఉన్నాకనే జీఎస్టీ అమలుకు శ్రీకారం చుడుతున్నారూ అనుకుంటే మంచిదే. కానీ, ఒక చారిత్ర ఘట్టాన్ని ఆవిష్కరించాం అని ప్రచారం చేసుకోవాలన్న తొందరలో నోట్ల రద్దు నిర్ణయం మాదిరిగా తత్తరపాటు పడితే.. ప్రజల నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది.