అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలైనా ప్రతి విమర్శలైనా ప్రజాప్రయోజనాంశాలపైనే ఉండాలి. పార్టీల మధ్య వాగ్యుద్ధం అంటే అది ప్రజా సమస్యలకు సంబంధించి జరగాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ మాటలు ఇప్పుడు ఎవ్వరికి గుర్తున్నాయి చెప్పండీ..! ఏపీలో వైకాపా, టీడీపీల మధ్య ప్రస్తుతం జరుగుతున్నది… మాటకు మాట బదులు చెప్పడం, వీలైతే వక్రీకరించడం. ఏపీ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు ఎక్కడ నోరు జారి మాట్లాడతారో అని వెయిట్ చేయడం.. ఆయన ప్రసంగంలో ఎక్కడో ఏదో తడబాటు దొరకడమే ఆలస్యం… దాన్ని పట్టుకుని రచ్చరచ్చ చేయడం వైకాపా దినచర్యల్లో భాగమైపోయింది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని కూడా ఇష్టం వచ్చినట్టు వక్రీకరించి సొంత పత్రికలో బ్యానర్ కథనాలు కూడా వేశారు. అధికార పార్టీ నేతల స్పీచులపై వైకాపా ఈ స్థాయిలో మాటు వేసి స్కాన్ చేస్తుంటే… అదే పని తెలుగుదేశం కూడా చేస్తుంది కదా! అలాంటప్పుడు జగన్ ఎంత జాగ్రత్తగా ఉండాలి? కానీ, జగన్ కూడా తాజాగా ఫ్లోలో మాట్లాడుతూ.. ఓ మాట జారారు!
గరగపర్రులో గడచిన వారంపైగా గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ అగ్రవర్ణాలూ, దళితుల మధ్య వివాదం చెలరేగింది. ఒక విగ్రహ ఏర్పాటు దగ్గర మొదలైన గొడవ.. రెండు వర్గాల మధ్య తగాదాగా మారిపోయింది. ఎవరికి వారు వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకున్నా పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఈ గ్రామానికి విపక్ష నేత జగన్ వెళ్లారు. రెండు వర్గాలతో మాట్లాడి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం అభినందనీయమే. అయితే, ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ… ‘చట్టం తనపని తాను చేసుకుని పోయుంటే సమస్య ఇంత దూరం వచ్చుండేదే కాదు. ఘటన జరిగినప్పుడే బాధితుల్ని అరెస్టు చేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు’ అన్నారు. అరెస్టు చేయాల్సింది నిందితులు అని చెప్పబోయి.. బాధితుల్ని అనేశారు. ఇంకేం, ఈ మాత్రం చాలు కదా.
‘ఘటన జరిగిన వెంటనే బాధితుల్ని అరెస్టు చేయాలా..? బాధితుల్ని ఆదుకోవాలిగానీ అరెస్టులు చేయాలా నాయనా’ అంటూ సోషల్ మీడియాలో జగన్ స్పీచ్ వీడియో క్లిప్పింగ్ పై కామెంట్స్ కనిపిస్తున్నాయి. లోకేష్ మాట్లాడటం నేర్చుకోవాలంటూ ఈ మధ్య ఎమ్మెల్యే రోజా లెక్చర్లు దంచారనీ, ఇప్పుడు జగన్ కూడా అదే సలహా ఇస్తారా అంటూ సెటైర్లు కనిపిస్తున్నాయి. మొత్తానికి, ఈ తడబాటును టీడీపీ కూడా వదలుకోదు కదా! లోకేష్ విషయంలో వైకాపా ఎంత రచ్చ చేస్తోందో… ఇప్పుడు టీడీపీ కూడా అదే పనిచేస్తుందనడంలో సందేహం లేదు.
లోకేష్ మాటల తడబాటుపై వైకాపాగానీ… ఇప్పుడు జగన్ విషయంలో టీడీపీగానీ ఇలాంటి వివాదాలను పెంచి పోషించుకుంటూ పోతే అంతిమంగా సాధించేది ఏముంటుంది? ఈ చర్చల వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా..? తనదాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు వైకాపాకి తత్వం బోధపడే అవకాశం ఉంది. తడబాటు అనేది ఎంతటివారికైనా సర్వసాధారణం అనేది తెలుసుకుంటే చాలు. ఇలాంటి రచ్చల్ని ఇక్కడితో వదులుకుంటే బెటర్!