ప్రముఖ నటుడు, మాజీ ఎంపి శతృఘ్న సిన్హా బిజెపిలో అసమ్మతివాదిగా పేరు పొందారు. నాయకత్వంపై ధైర్యంగా విమర్శలు చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతులున్నాయి గనక అధిష్టానం కూడా ఆయన విషయంలో చూచీ చూడనట్టు సరిపెడుతుంటుంది. దేశంలో గోరక్షణ పేరిట హత్యలు పెరిగిపోతున్నాయని ప్రధాని మోడీ ఇటీవల సబర్మతి ఆశ్రమం దగ్గర చేసిన వ్యాఖ్యలను కూడా సిన్ణా ఇలాగే తీసిపారేశారు.గోరక్షణ పేరిట జరిగే హత్యలు తనకు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని ఎవరికి వారు ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలాగని ప్రశ్నించారాయన. ఆవులకు ముందు గడ్డివేసి ఆకలి నుంచి కాపాడకుండా మరెవరినో చంపడమేమిటి? రైలులో రంజాన్ రోజున ఏదో తిన్నాడని అమాయకుడైన జునైడిన్ను చంపే హక్కు ఎవరిచ్చారు?ఎవరు ఏం తినాలో ఏం కట్టుకోవాలో మీరు శాసిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారట.
ఇలాటి హత్యాకాండను ఆలస్యంగా అతి పరిమితంగా ఖండిస్తే చాలదని స్పష్టం చేశారు. ” మోడీ ఈ దేశంలో అతిపెద్ద యాక్షన్హీరోగా నేను పరిగణిస్తాను. ఈమూక హత్యలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆయన ముందుకు రావాలి. చట్టాన్ని తమచేతుల్లోకి తీసుకునే వారు దేశానికి గాని బిజెపికి గాని ప్రతినిధులు గారని ఆయన నిరూపించాలి అన్నారు శతృఘన్.