తెలంగాణలో ప్రాజెక్టుల కోసం భారీ ఎత్తున భూసేకరణకు కెసిఆర్ ప్రభుత్వం దూకుడు పెంచుతున్నది. గతంలో మల్నన్నసాగర్ వంటి చోట్ల ప్రతిపక్షాలు రైతుల నుంచి నిరసన వ్యక్తం కావడం, అనేక సార్లు కోర్టులు కూడా జోక్యం చేసుకోవడం చూశాం. భూ నిర్వాసితులకు తగు పరిహారం ఇవ్వకుండా సామాజిక ప్రభావం మదింపు లేకుండా భూములు తీసుకోరాదన్నది ప్రధాన సమస్య. దీన్నుంచి బయిటపడటానికి గాను ప్రభుత్వం చివరకు 2013 భూ సేకరణ చట్టాన్ని సవరిస్తూ 21/2017 ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. మార్పులు చేర్పుల తర్వాత దీనికి రెండు మాసాల కిందట రాష్ట్రపతి ఆమోదం లభించింది. అందులో తను కోరుకున్న ప్రకారం ఆ సవరణ చట్టం వున్నా అమలుకు సంబంధించిన విధి విధానాలను ఇంతవరకూ ఖరారు చేయలేదు. 2103 చట్టం కింద సేకరణ నోటిఫికేషన్లు ప్రకటించి పని పూర్తి చేద్దామనుకుంటే ప్రతిఘటన ఎదురైంది గనకే కొత్త చట్టం అవసరమైంది. మరి కొత్త చట్టం భవిష్యత్తుకు తప్ప గతంలోనే ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చిన చోట్ల వర్తించదు. ఇందుకు పరిష్కారంగా ప్రభుత్వం అయిదు ప్రాజెక్టులకు సంబంధించి 2013లోని రెండు అధ్యాయాల అమలును మినహాయిస్తూ విడివిడిగా ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, డిండి, ప్రాణహిత, సీతారామ ప్రాజెక్టులకు సామాజిక ప్రభావ అంచనా , ఆహార భద్రతల పరిశీలన అనే అంశాలు వర్తించబోవని నీటిపారుదలశాఖ కార్యదర్శి వీటిని జారీ చేశారు. అంటే ఇక్కడ కూడా కొత్త చట్టం ప్రకారమే పరిహారం నిబంధనలు వుంటాయన్నమాట. ఇప్పటికే నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య మరింత వ్యతిరేకతకు దారితీసినా ఆశ్చర్యం లేదు.వాటిని ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రగా ప్రభుత్వం చిత్రించడమూ అనివార్యమే.